100 రోజుల్లో బోడుప్పల్‌‌లో బస్‌‌ టెర్మినల్‌‌..రూ.3.22 కోట్లతో నిర్మిస్తాం: మంత్రి పొన్నం

100 రోజుల్లో బోడుప్పల్‌‌లో బస్‌‌ టెర్మినల్‌‌..రూ.3.22 కోట్లతో నిర్మిస్తాం: మంత్రి పొన్నం

మేడిపల్లి, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ పరిధిలోని బోడుప్పల్‌‌ సర్కిల్‌‌10లో 100 రోజుల్లో బస్​టెర్మినల్​నిర్మిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. రూ.3.22 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్‌‌ జోనల్‌‌ వర్క్‌‌షాప్‌‌ పరిధిలో రోజుకు 1,053 బస్సు ట్రిప్పులు నడుస్తున్నాయని, అధునాతన సౌకర్యాలతో బస్​టెర్మినల్‌‌ నిర్మిస్తామని తెలిపారు. దీని ద్వారా భువనగిరి, యాదగిరిగుట్ట, హనుమకొండ, వరంగల్‌‌ వెళ్లే సుమారు లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 

బోడుప్పల్‌‌, పీర్జాదిగూడ ప్రాంతాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని బస్‌‌స్టేషన్‌‌కు వాటి పేరునే పెడతామని వెల్లడించారు. ఇప్పటివరకు 3 వేలకు పైగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, పీఎం ఈ -డ్రైవ్‌‌ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్‌‌ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌‌లో అవసరమైన కొత్త రూట్లలో బస్సులు నడిపిస్తున్నామన్నారు. తమ ప్రాంతాల్లో బస్సుల అవసరాన్ని అధికారులు దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఆర్టీసీ రిటైర్డ్‌‌ కార్మికులకు సుమారు రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ అంశంపై సీఎం రేవంత్‌‌రెడ్డితో చర్చించామని, త్వరలోనే నిర్ణయం వస్తుందన్నారు.  

ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం

పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికైన గుర్తింపు సంఘంతో కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. పాత డీజిల్‌‌ బస్సుల్లో తొలి దశలో 250 బస్సులను రెట్రోఫిట్‌‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మల్కాజ్​గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్​యాదవ్, మాజీ మేయర్లు అజయ్, అమర్ సింగ్, జక్కా వెంకట్ రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్, డిపో మేనేజర్లు, కార్మికులు పాల్గొన్నారు.