ఆర్టీసీ భూముల స్వాధీనంపై కార్మిక సంఘాల ఫైర్

ఆర్టీసీ భూముల స్వాధీనంపై కార్మిక సంఘాల ఫైర్

హైదరాబాద్, వెలుగు: ముషీరాబాద్‌‌‌‌లో ఆర్టీసీకి చెందిన 6 ఎకరాల15 గుంటల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాలని భావిస్తుండటంపై ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌‌‌‌ఎంయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌‌‌‌డబ్ల్యూఎఫ్‌‌‌‌) లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు శనివారం ఈయూ కార్యదర్శి ఈదురు వెంకన్న, ఎన్‌‌‌‌ఎంయూ అధ్యక్షుడు కమాల్ రెడ్డి, ఎస్‌‌‌‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు వేర్వేరు ప్రకటనల్లో ఆర్టీసీ యాజమాన్యం తీరును తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ఆస్తులను ఇలాగే అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో సంస్థకు భూములు కరువవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న భూములను కాపాడుకుంటేనే భవిష్యత్తులో సంస్థ అవసరాలకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన నేతలు.. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.