హైదరాబాద్, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంలో నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడులు చేయడం, వేధించడం, కేసులు నమోదు చేయడం ఆందోళనకరమని మంత్రి సీతక్క అన్నారు. ప్రశ్నించే మహిళా జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సును ఆమె ముఖ్య అతిథిగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పరస్పరం ఆధారపడి ఉంటాయని, స్వతంత్ర మీడియా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని అన్నారు. ప్రశ్నలను అణచివేయడంలో కాకుండా, వాటికి సమాధానాలు చెప్పడంలోనే ప్రజాస్వామ్య బలం ఉంటుందని పేర్కొన్నారు. జర్నలిస్టులు అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడిగినంత మాత్రాన వారిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా భావించడం సరికాదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో మహిళల స్వేచ్ఛ, భద్రతపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు.
మహిళలను పురుషాధిక్యత కింద బంధించాలనే మనుస్మృతి భావజాలానికి బదులుగా.. అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను కోరుకుంటున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతూ, ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
సాధికారత అంటే సంపాదన మాత్రమే కాదని, నిర్ణయాధికారం, ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టుల భద్రత, గౌరవం కోసం అందరూ ఐక్యంగా నిలవాలని ఐజేయూకు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రాధారాణి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, కర్ణాటక మీడియా అకాడమీ చైర్పర్సన్ అయిషా కనుమ్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, విరాహత్ అలీ, సోమసుందర్, అరుణ తదితరులు పాల్గొన్నారు.
