పద్మారావునగర్: మహిళల వాష్‌‌ రూమ్‌‌ లో రహస్య కెమెరా..పవర్‌‌ గ్రిడ్‌‌ ఆఫీస్ లో కలకలం

పద్మారావునగర్: మహిళల వాష్‌‌ రూమ్‌‌ లో రహస్య కెమెరా..పవర్‌‌ గ్రిడ్‌‌ ఆఫీస్ లో కలకలం
  •     నిందితుడు అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌ పరిధిలోని కవాడిగూడలో గల పవర్‌‌గ్రిడ్‌‌ కార్పొరేషన్‌‌ ప్రధాన కార్యాలయంలో తీవ్ర కలకలం రేగింది. పటిష్ట భద్రత ఉండే ఆ ఆఫీస్​లోని మహిళల వాష్‌‌రూమ్‌‌లో ఓ కామాంధుడు రహస్యంగా మొబైల్ ఫోన్‌‌ అమర్చాడు. ఆరో అంతస్తులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగి శనివారం వాష్‌‌రూమ్‌‌కి వెళ్లగా, వాష్‌‌బేసిన్‌‌ కింద గోడకు డబుల్ సైడెడ్ టేప్‌‌తో అంటించిన మొబైల్ ఫోన్‌‌ ఆమె కంటపడింది. కెమెరా మినహా మిగతా భాగం కనిపించకుండా తెల్లటి కాగితం అడ్డుగా పెట్టినట్లు గుర్తించి, అప్రమత్తమయ్యారు. వెంటనే అదే అంతస్తులో పనిచేస్తున్న ఫ్లోర్ అటెండెంట్ భరత్‌‌ను నిలదీయడంతో, అతను పారిపోయేందుకు యత్నించాడు. 

బాధితురాలి కేకలతో తోటి ఉద్యోగులు, హెచ్‌‌ఆర్‌‌ సిబ్బంది, సెక్యూరిటీ అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. ఫోన్‌‌లోని వీడియో ఫోల్డర్‌‌కు పిన్‌‌ నంబర్‌‌ ఉండగా, పాస్‌‌వర్డ్‌‌ చెప్పాలని కోరగా.. భరత్‌‌ ఆ ఫోన్‌‌ లాక్కొని నేలకేసి బలంగా కొట్టి ధ్వంసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గాంధీనగర్‌‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని సిటీ సైబర్‌‌క్రైమ్‌‌ విభాగానికి బదిలీ చేశారు. ధ్వంసమైన మొబైల్‌‌ను ఫోరెన్సిక్‌‌ ల్యాబ్‌‌కు పంపి, డిజిటల్ డేటా రికవరీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.