‘కేబీఆర్’ కారిడార్‌‌ పనుల పరిశీలన

‘కేబీఆర్’ కారిడార్‌‌ పనుల పరిశీలన

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్‌‌ చెక్‌‌పోస్టు నుంచి ఎన్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ జంక్షన్‌‌ వరకు నిర్మించనున్న 4.3 కిలోమీటర్ల ఎలివేటెడ్‌‌ కారిడార్‌‌ పనులను జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ ఆర్వీ కర్ణన్‌‌ శనివారం ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. కేబీఆర్‌‌ పార్క్​మెయిన్ ఎంట్రెన్స్, అగ్రసేన్‌‌ జంక్షన్‌‌, జూబ్లీహిల్స్‌‌ చెక్‌‌పోస్టు వద్ద జంక్షన్ల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కారిడార్‌‌ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్‌‌ తదితర యుటిలిటీల తరలింపు కోసం టీజీఎస్‌‌పీడీసీఎల్‌‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. 

మరోవైపు ముగ్ధా జంక్షన్‌‌ నుంచి ఎన్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ జంక్షన్‌‌ వరకు ఫౌండేషన్‌‌ డిజైన్‌‌కు అవసరమైన జియోటెక్నికల్‌‌ పరిశోధనలను వేగవంతం చేయాలన్నారు. జూబ్లీహిల్స్‌‌ చెక్‌‌పోస్టు నుంచి ముగ్ధా జంక్షన్‌‌ వరకు పునాదుల కోసం తవ్వకాలు, ఆఫ్‌‌సైట్‌‌లో స్టీల్‌‌ నిర్మాణాల తయారీ పనులను కూడా వేగంగా చేపట్టాలని సూచించారు. జోనల్ కమిషనర్ సంతోష్, చీఫ్ ఇంజినీర్ జ్యోతిర్మయి, ఎస్ఈ విజయ్ కుమార్ తదితరులున్నారు.