- 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి
- రాణించిన నమన్, నితీష్ కుమార్
- ఫిలిప్స్, జాకబ్స్, శాంట్నర్ శ్రమ వృథా
క్రైస్ట్‌చర్చ్: టార్గెట్ ఛేజింగ్‌లో తెలుగు బ్యాటర్లు తిలక్ వర్మ (26 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ (13 బాల్స్‌లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 26 నాటౌట్) చెలరేగడంతో.. శనివారం జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2–0 ఆధిక్యంలో నిలిచింది.
టాస్ ఓడిన కివీస్ 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (43 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకబ్స్ (46 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. తర్వాత ఇండియా 19.5 ఓవర్లలో 181/6 స్కోరు చేసి నెగ్గింది. నమన్ ధీర్ (17 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 31) రాణించాడు. తిలక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మంగళవారం వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.
బౌలర్లు ఓకే..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను ఆరంభం నుంచి ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. రెండో ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ (2/33).. టిమ్ సీఫెర్ట్ (7)ను ఔట్ చేయగా, తర్వాతి ఓవర్‌లో భువనేశ్వర్ (1/50) .. డారిల్ మిచెల్ (6)ను పెవిలియన్‌కు పంపాడు. ఆరో ఓవర్‌లో ప్రిన్స్ యాదవ్ (1/30) దెబ్బకు ఫిన్ అలెన్ (16) వెనక్కి వచ్చేశాడు. దాంతో పవర్‌ప్లేలో కివీస్ 41/3 స్కోరుతో నిలిచింది. ఇక్కడినుంచి ఫిలిప్స్, జాకబ్స్ నిదానంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా భారీ షాట్లు కొట్టారు.
ఫలితంగా ఫిలిప్స్ 33, జాకబ్స్ 40 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఈ క్రమంలో 14వ ఓవర్‌లో కివీస్ స్కోరును వంద దాటించారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని 18వ ఓవర్‌లో అర్ష్‌దీప్ .. ఫిలిప్స్‌ను ఔట్ చేసి విడగొట్టాడు. దాంతో నాలుగో వికెట్‌కు 116 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 19వ ఓవర్‌లో నితీష్ కుమార్ (1/31)... జాకబ్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. చివర్లో మైకేల్ బ్రెస్‌వెల్ (10 నాటౌట్) ఫోర్, సిక్స్ కొట్టడంతో కివీస్ మంచి స్కోరు సాధించింది.
70 రన్స్‌కే 5 వికెట్లు..
ఛేజింగ్‌లో ఇండియాకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ (4/21) తన స్పిన్ మ్యాజిక్‌తో టాప్ ఆర్డర్‌ను కూల్చేశాడు. ఓపెనర్ సంజూ శాంసన్ (14).. జాకబ్ డఫీ (1/41) బౌలింగ్‌లో ఔట్ కాగా, వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (4)ని నాథన్ స్మిత్ (1/34) పెవిలియన్‌కు పంపాడు. పవర్‌ప్లేలో 44/1 స్కోరు చేసిన ఇండియాను శాంట్నర్ దెబ్బకొట్టాడు. 9వ ఓవర్‌లో అభిషేక్ శర్మ (27)ను ఔట్ చేసిన శాంట్నర్.. 11వ ఓవర్‌లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.
మూడు బాల్స్ తేడాలో శ్రేయస్ అయ్యర్ (7), అక్షర్ పటేల్ (11) వికెట్లు తీశాడు. దాంతో ఇండియా 10.5 ఓవర్లలో 70/5 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో తిలక్ వర్మతో జత కట్టిన నమన్ వేగంగా ఆడాడు. మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు 42 రన్స్ జత చేసి 15వ ఓవర్‌లో శాంట్నర్‌కు వికెట్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి తిలక్, నితీష్ కుమార్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ఆడారు. క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబడుతూ రన్‌రేట్‌ను కాపాడారు. 25 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన తిలక్.. నితీష్‌తో ఏడో వికెట్‌కు 69 రన్స్ జోడించి గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 180/5 (ఫిలిప్స్ 70, జాకబ్స్ 58, అర్ష్‌దీప్ 2/33).
ఇండియా: 19.5 ఓవర్లలో 181/6 (తిలక్ 51*, నితీష్ 26*, శాంట్నర్ 4/21).
300 టీ20ల్లో ఇండియా ఆడిన మ్యాచ్‌లు. ఇందులో 207 విజయాలు, 83 ఓటములు ఉండగా, 10 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 20 ఏళ్ల కిందట జొహనెబర్గ్‌లో సౌతాఫ్రికాతో ఇండియా తొలి మ్యాచ్ ఆడింది. పాకిస్తాన్ అత్యధికంగా 304 మ్యాచ్‌లు ఆడగా.. 177 గెలిచింది.
