ఆదివాసీలకు జాబ్ కార్డులు ఇవ్వకపోతే చర్యలు: మంత్రి సీతక్క

ఆదివాసీలకు జాబ్ కార్డులు ఇవ్వకపోతే చర్యలు: మంత్రి సీతక్క
  • గ్రామీణులకు ఉపాధి కల్పించేలా 8 నెలల యాక్షన్ ప్లాన్

హైదరాబాద్, వెలుగు: అర్హులైన ఆదివాసీ, గిరిజనులు జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేయాలని, వారిని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ వేధిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క ఎంపీడీవోలను హెచ్చరించారు. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడి, వ్యవసాయ రంగ సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, శాశ్వత ఆస్తుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు.

ఉపాధి హామీ పథకంలో కేవలం సమాధానాలు చెప్పి తప్పించుకోవడం సరికాదని, క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించాలని తెలిపారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌‌‌‌ నుంచి వీబీ-జీ రామ్ జీ పనుల పురోగతిపై డీఆర్‌‌‌‌‌‌‌‌డీవోలు, ఈఈలు, ఎంపీడీవోలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనుల్లో వేగం పెంచని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రాధాన్యత క్రమంలో 50 పనులకు పెద్దపీట
అన్ని పనులను ఒకేసారి చేపట్టకుండా ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి లభించేలా 8 నెలల పక్కా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌‌‌‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈనెల30 నాటికి మండలస్థాయి సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో పనుల ప్రణాళికలు పూర్తిచేయాలని ఆదేశించారు.

నవంబర్ 1 నుంచి క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులు ప్రారంభం కావాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రతి రెండు నెలలకోసారి యాక్షన్ ప్లాన్‌‌‌‌ను సమీక్షించాలని ఆదేశించారు. పథకంలో అనుమతించిన 370 రకాల పనులను స్థానిక అవసరాలు, కూలీల లభ్యత ఆధారంగా విభజించి, కనీసం 50 రకాల ముఖ్యమైన పనులను లక్ష్యాల మేరకు పూర్తిచేయాలని సూచించారు.