ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్ ఫైనల్లో సింధు..

ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్ ఫైనల్లో సింధు..

పారిస్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో సింధు 21–10, 20–22, 21–16తో వరల్డ్‌‌‌‌ 22వ ర్యాంకర్‌‌‌‌ హినా అకెచీ (జపాన్‌‌‌‌)పై నెగ్గింది. గంటా 13 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో తెలుగమ్మాయి అద్భుతంగా ఆడింది. తొలి గేమ్‌‌‌‌ ఆరంభంలో ఇద్దరు షట్లర్లు హోరాహోరీగా పోరాడారు. దాంతో 4–4, 8–8తో ముందుకెళ్లారు. అయితే 11–9 వద్ద సింధు బలంగా పుంజుకుంది. చివరి 12 పాయింట్లలో 11 గెలిచి గేమ్‌‌‌‌ను కైవసం చేసుకుంది. 

హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌‌‌‌లో సింధు చివర్లో తడబడింది. 7–7, 10–10, 14–14, 20–20తో ముందుకెళ్లినా.. చివర్లో జపాన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కొట్టిన రెండు బలమైన స్మాష్‌‌‌‌లను తీయలేకపోయింది. 5–3 ఆధిక్యంతో డిసైడర్‌‌‌‌ను మొదలుపెట్టిన సింధును హినా 15–15తో సమం చేసింది. 

ఈ దశలో 38 షాట్ల ర్యాలీలో హినా చిన్న తప్పు చేయడంతో సింధు 18–16 లీడ్‌‌‌‌లోకి వెళ్లింది. తర్వాత నెట్‌‌‌‌ వద్ద ఫైన్‌‌‌‌ షాట్స్‌‌‌‌ కొట్టి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు.. వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ అన్‌‌‌‌ సే యంగ్‌‌‌‌ (కొరియా)తో తలపడుతుంది.