హైదరాబాద్ సిటీ, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, తప్పులు చేస్తే సమాధానం చెప్పుకోవాల్సింది తనకేనని సీఎంసీ కమిషనర్ సృజన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సీఎంసీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో సుమారు 5 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ‘మీరు పనిచేయకపోతే ఎట్లా? మీరు తప్పు చేస్తే నేను మాటలు పడాలా?’ అంటూ గట్టిగా క్లాస్ తీసుకున్నారు. సమస్యలను పరిష్కరించకుండా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండా ఆఫీస్‌లకే పరిమితమైతే సహించేది లేదని హెచ్చరించారు.
ముఖ్యంగా జూన్ 9న వరదలు రావడానికి దారితీసిన కారణాలు, అక్కడ పనులు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, చెత్త సేకరణ, దోమల నివారణ, స్ట్రీట్ లైట్లు, పార్కులు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనుల్లో జాప్యంపై ఆరా తీశారు. రానున్న జనగణనను దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హెచ్వోడీలు తమ పరిధిలోని సమస్యలను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా, సత్వర పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు. అదనపు, జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్, సీసీపీ, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
