హైదరాబాద్, వెలుగు: తమ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు, కొత్త టెక్నాలజీల గురించి తెలియజేయడానికి, కమ్యూనిటీ నిర్మాణం కోసం గూగుల్ డెవలపర్ గ్రూప్ (జీడీజీ) హైదరాబాద్ ఆధ్వర్యంలో డెవలపర్ఫెస్ట్ను శనివారం నిర్వహించింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలపర్ ఆప్స్, మొబైల్ ఇన్నోవేషన్లపై ఇది దృష్టి సారించింది. మూడు వేలకు పైగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్స్, ఫౌండర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఏఐ అవతార్ ఆవిష్కరణ అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి శ్రీధర్ బాబు మొదటి ప్రీ ఏజీఐ అవతార్‌ను వేదికపై ఆవిష్కరించారు. ఐటీ సలహాదారు సాయి కృష్ణ పర్యవేక్షణలో టెన్సర్‌గో సంస్థ దీన్ని హ్యూమెయిన్ ప్లాట్‌ఫామ్‌తో అభివృద్ధి చేసింది.
ప్రజలతో నాయకులు సంభాషించడానికి ఏఐ ఎలా ఉపయోగపడుతుందో ఈ సందర్భంగా వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు ‘ఇన్నోవేషన్ ఎట్ స్కేల్’ అంశంపై ప్రసంగించారు. తెలంగాణను ప్రపంచ ఏఐ కేంద్రంగా మార్చే దిశగా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు, స్టార్టప్‌ల నుంచి వచ్చే గొప్ప ఏఐ ఆలోచనలకు తెలంగాణ వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు.
