- ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నీ నమోదు కావాల్సిందేనని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన బాధితులను ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన మొదటి గంట)లో సమీప ఆసుపత్రులకు తరలిస్తే రూ.1.50 లక్షల విలువైన అత్యవసర వైద్య చికిత్సలను ఉచితంగా అందించే కేంద్ర ప్రభుత్వ ‘పీఎం రాహత్’ (ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్సా పథకం)లో రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రులను తక్షణమే నమోదు చేయించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద వెయ్యికి పైగా ఆసుపత్రులు నమోదై సేవలు అందిస్తుంటే, పీఎం రాహత్ స్కీమ్‌లో కేవలం 469 దవాఖానలు మాత్రమే నమోదు కావడం పట్ల కలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిగిలిన అన్ని నెట్వర్క్ ఆసుపత్రులను యుద్ధప్రాతిపదికన ఎన్రోల్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా ఏటా కనీసం రూ.100 కోట్ల మేర ప్రమాద బాధితుల చికిత్సలకు నిధులు సమకూరే అవకాశముందని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకంపై నిధుల భారం తగ్గుతుందని వివరించారు.
