8 నెలల్లో 19 లింగ మార్పిడి సర్జరీలు.. ఉస్మానియా హాస్పిటల్లో ఫ్రీగా జెండర్ అఫర్మింగ్ ఆపరేషన్లు

8 నెలల్లో 19 లింగ మార్పిడి సర్జరీలు.. ఉస్మానియా హాస్పిటల్లో ఫ్రీగా జెండర్ అఫర్మింగ్ ఆపరేషన్లు
  • 8 నెలల్లో 19 లింగ మార్పిడి సర్జరీలు..
  • రాష్ట్రంలోనే తొలిసారి ఉస్మానియా హాస్పిటల్లో జెండర్ అఫర్మింగ్ ఆపరేషన్లు
  • సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ ద్వారా వంద శాతం ఉచిత వైద్యం

హైదరాబాద్, వెలుగు: లింగమార్పిడి చికిత్సల విషయంలోఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. గడిచిన 8 నెలల వ్యవధిలోనే 19 లింగమార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సర్జరీలన్నీ పేషంట్లకు పైసా ఖర్చు లేకుండా సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి ఉచితంగా చేయడం విశేషం.

ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ టీమ్ స్త్రీల నుంచి పురుషులుగా మారినవారికి, పురుషుల నుంచి స్త్రీలుగా మారిన వారికి వేర్వేరుగా మొత్తం 19 సర్జరీలు చేసింది. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన 9 మందికి నిపుల్ ఏరియోలా కాంప్లెక్స్ దెబ్బతినకుండా ఉస్మానియా డాక్టర్లు రొమ్ములను తొలగించి పురుషుడి ఛాతీలా మార్చే (మాస్టెక్టమీ) ఆపరేషన్లు చేశారు. మరో ఇద్దరికి లాప్రోస్కోపిక్ విధానంలో గర్భసంచిని తొలగించారు.

అలాగే, పురుషుడి నుంచి స్త్రీగా మారిన వారిలో ఇద్దరికి సిలికాన్ ఇంప్లాంట్లతో, ఒకరికి శరీరంలోని కొవ్వుతో రొమ్ముల పరిమాణం పెంచే సర్జరీలు చేశారు. ఒకరికి పురుషాంగాన్ని తొలగించి సహజ యోనిని పునర్నిర్మించే (పెనెక్టమీ విత్ వెజైనోప్లాస్టీ) సర్జరీ చేశారు. మరొకరికి వృషణాల తొలగింపు (ఆర్కిడెక్టమీ), ఇంకొకరికి స్త్రీ రూపురేఖల కోసం హెయిర్‌‌‌‌లైన్ అడ్వాన్స్‌‌‌‌మెంట్, ఫోర్‌‌‌‌హెడ్ రిడక్షన్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.

కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఖరీదైన సర్జరీలను ఉస్మానియాలో సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నారు. ముఖ్యంగా సిలికాన్ జెల్ బ్రెస్ట్ ఇంప్లాంట్లను సైతం సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ ద్వారా రోగులకు సమకూర్చడం విశేషం.

సర్జరీల్లో పాల్గొన్న డాక్టర్లు వీరే..
ఈ ప్రక్రియ అంతర్జాతీయ వైద్య నియమావళి ప్రకారం సాగింది. ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పలుకూరి లక్ష్మి నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ దివ్య, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ నాగభూషణం తదితరులు శ్రమించారు.

వీరికి అనస్థీషియా వైద్యులు డాక్టర్ పాండు నాయక్, డాక్టర్ మాధవి, ఎండోక్రినాలజీ విభాగం నుంచి ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్, హెచ్ఓడీ డాక్టర్ నీలవేణి, యూరాలజీ, గైనకాలజీ, సైకియాట్రీ టీమ్ లు పూర్తి సహకారం అందించాయి. సర్జరీకి ముందే ట్రాన్స్‌‌‌‌జెండర్లకు సైకోథెరపీ, మానసిక కౌన్సిలింగ్, హార్మోన్ థెరపీలను నిర్వహించి, ఆ తర్వాతే సర్జరీలకు అనుమతిస్తున్నారు.

ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి
గత ఎనిమిది నెలల్లో 19 సర్జరీలను సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ ద్వారా 100 శాతం ఉచితంగా పూర్తి చేశాం. సహకరించిన ప్రభుత్వానికి, క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్‌‌‌‌కు ధన్యవాదాలు. ప్రైవేటులో లక్షల రూపాయల ఖర్చయ్యే వైద్యం చేయించుకోలేక చాలామంది నాటు వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం ఉస్మానియాలో ఈ స్పెషల్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అర్హులైన ట్రాన్స్‌‌‌‌జెండర్లు ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

ప్రొఫెసర్ డాక్టర్ పలుకూరి లక్ష్మి, హెచ్‌‌‌‌వోడీ, ప్లాస్టిక్ అండ్ రీకన్‌‌‌‌స్ట్రక్టివ్ సర్జరీ డిపార్ట్మెంట్