ఈ20తో ఆహార సంక్షోభం..! భారీగా పెరిగిన మొక్కజొన్న, నూకలు, గుడ్లు, చక్కెర ధరలు

ఈ20తో ఆహార సంక్షోభం..! భారీగా పెరిగిన మొక్కజొన్న, నూకలు, గుడ్లు, చక్కెర ధరలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ–20 పెట్రోల్ విధానం వల్ల ఇంధన ధరలు తగ్గకపోగా, ఆహార సంక్షోభం నెలకొంటోంది. ముఖ్యంగా  మొక్కజొన్న, చెరకు, నూకలకు డిమాండ్ పెరగడంతో వీటి ధరలు ఎగిశాయి. ఈ ఎఫెక్ట్ గుడ్లు, చికెన్‌‌‌‌‌‌‌‌ వంటి మాంసాహార ధరలపై పడుతోంది. చెరకు నుంచి ఇథనాల్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయడాన్ని నిషేధించడంతో మొక్కజొన్న ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. దాదాపు 70శాతం – 100శాతం పెరుగుదల కనిపించింది.  

డిస్టిలరీలు పెద్ద ఎత్తున మొక్కజొన్నను సేకరించడం ప్రారంభించాయి. గతంలో (2019–2021 సమయంలో) కేజీ మొక్కజొన్న ధర రూ.12 నుంచి రూ.15 మధ్య ఉండేది. ఈ–20 వాడకం పెరగడంతో బహిరంగ మార్కెట్లో దీని ధర క్రమంగా పెరిగి ప్రస్తుతం రూ.25 నుంచి రూ.28 వరకు చేరింది. ఆఫ్-సీజన్‌‌‌‌‌‌‌‌లో కొన్ని ప్రాంతాల్లో ఇది ఏకంగా రూ.30 – రూ.32 వరకు ఉంటోంది.  ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్‌‌‌‌‌‌‌‌పీ (సుమారు రూ.2,225/క్వింటాల్) కంటే బహిరంగ మార్కెట్ ధరలు 15శాతం నుంచి 25శాతం అధికంగా ట్రేడ్ అవుతున్నాయి.   

దేశంలో పండే మొత్తం మొక్కజొన్నలో 55 నుంచి 60 శాతం వాటాను కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ రంగం) దాణా కోసం వాడుతోంది. కరువు వల్ల ఈ పంట దిగుబడి తగ్గడంతో  మార్కెట్లో కొరత ఏర్పడింది. దీనివల్ల పౌల్ట్రీ దాణా ధరలు పెరిగిపోతున్నాయి. కోళ్ల దాణా ఖర్చులు ఎక్కువవ్వడంతో  ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతిమంగా సామాన్యుడిపై భారం పడుతోంది. రోజూ తినే చికెన్, కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయి. 

 దాణా ధరలు పెరగడంతో  ఒక్కో గుడ్డు ధర రూ.5 నుంచి రూ.7–రూ.8 వరకు, చికెన్ ధరలు దాదాపు 30శాతం నుంచి 40శాతం వరకు  పెరిగాయి.  నూకల ధరలు కూడా 25శాతం నుంచి 35శాతం మేర పెరిగాయి.  దీంతో గతంలో కేజీ రూ.16 నుంచి రూ.18 వరకు పలికిన నూకలు ధరలు మార్కెట్లో రూ.22 నుంచి రూ.25 వరకు పెరిగాయి. దీంతో పశువుల దాణా,  మద్యం తయారీ రంగాల్లో ఖర్చులు ఎక్కువయ్యాయి. 

 చెరకు, మొలాసిస్ ధరలూ పైకే

 చెరకు రైతులకు చెల్లించే  గిట్టుబాటు ధరను  ప్రభుత్వం క్వింటాల్​కు రూ.275–-రూ.285 స్థాయిల నుంచి క్రమంగా పెంచింది. ప్రస్తుతం క్వింటాల్​ ధరను రూ.340 చేసింది. ఇది దాదాపు 20శాతం పెరుగుదల.  ఇథనాల్ తయారీ కోసం డిస్టిలరీల పోటీ పెరగడంతో బైప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ అయిన సీ -హెవీ, బీ-హెవీ మొలాసిస్ టన్ను ధరలు బహిరంగ మార్కెట్లో గతంలో రూ.4,000–-రూ.5,000 ఉండగా, డిమాండ్ ఎక్కువగా ఉన్న టైమ్‌‌‌‌‌‌‌‌లో  రూ.8,000 నుంచి రూ.11,000 వరకు పెరిగాయి. ఆ మధ్య  చక్కెర ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే.  కేజీ ధర  రూ.40-–రూ.44 దాటిపోకుండా ఉండేందుకే ప్రభుత్వం తాజాగా చెరకు రసం, షుగర్ సిరప్ నుంచి ఇథనాల్ తయారీపై తాత్కాలిక నిషేధం విధించాల్సి వచ్చింది.

 ఇతర పంటలపై ప్రభావం..

మొక్కజొన్నకు ఇథనాల్ కంపెనీల నుంచి  డిమాండ్ ఉండడం, అధిక ధరలు లభిస్తుండటంతో.. రైతులు సోయాబీన్, వేరుశనగ, కందులు, మినుములు సాగు విస్తీర్ణం తగ్గించి మొక్కజొన్న సాగు వైపు మళ్లుతున్నారు. దీంతో పరోక్షంగా నూనెలు, పప్పుల దిగుమతులపై ప్రభావం పడుతోందని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు. ఈ–20 వల్ల  రైతులు ఆదాయాలు పెరిగినా, ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ నిల్వలు ఆదా అయినా.. సామాన్యులపై మాత్రం భారం పెరిగిందనేది వాస్తవమని వివరించారు. ముఖ్యంగా ఎల్‌‌‌‌‌‌‌‌నినోతో కరువు నెలకొనడం ఈ పరిస్థితులను మరింత తీవ్రం చేస్తున్నాయని తెలిపారు.