- సమస్యలు పరిష్కరించి అండగా ఉంటాం: మంత్రి వివేక్
- ఇందిరా భవన్లో పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు పొన్నం,శ్రీధర్ బాబు హాజరు
హైదరాబాద్, వెలుగు: దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో తమ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. న్యాయవాదుల సమస్యలు, సంక్షేమంపై చర్చించేందుకు నవంబర్లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. శనివారం గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారం, సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వారికి అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన న్యాయవాదులకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుతో పాటు ఇతర ముఖ్య నేతలతో చర్చించి న్యాయవాదులకు ప్రయోజనం కలిగించే అంశాలను మేనిఫెస్టోలో చేర్చుతామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాదులు గట్టిగా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర
పోషించారని గుర్తు చేశారు.
సముచిత స్థానం కల్పిస్తం: పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2023లో తెలంగాణలో ప్రజా పాలన ఏర్పడటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని అన్నారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన న్యాయవాదులకు పార్టీపరంగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని న్యాయవాదులకు ఇందిరమ్మ ప్రమాద బీమా అమలు చేస్తామని తెలిపారు.
హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. లా డిపార్ట్మెంట్ కూడా సీఎం పరిధిలోనే ఉన్నందున న్యాయవాదుల సంక్షేమం, కార్పస్ ఫండ్ పెంపుపై త్వరలోనే సీఎంతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మాజీ ఎంపీ మధు యాష్కీ పాల్గొన్నారు
