- విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని పిలుపు
- మూడేండ్ల ‘బీ రెడీ’ స్పెషల్ క్యాంపెయిన్ షురూ
- ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన వస్తువుల లిస్ట్ విడుదల!
లండన్: తీవ్రమైన వాతావరణ మార్పులు, కార్చిచ్చులు, సైబర్ దాడిల వంటి ప్రమాదాలను తట్టుకుని నిలబడేలా అందరూ సిద్ధమవ్వాలని తమ దేశ ప్రజలను బ్రిటన్ ప్రభుత్వం కోరింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. ఒకవేళ ఆహారం, తాగునీరు, విద్యుత్, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు అంతరాయం కలిగితే కనీసం మూడు రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రతకడానికి ప్రజలు తమ ఇండ్లల్లో అవసరమైన సామగ్రిని నిల్వచేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ప్రధాని ఆండీ బర్నమ్ ప్రభుత్వం మూడేండ్ల 'బీ రెడీ (సిద్ధమవ్వండి)' అనే స్పెషల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
ఊహించని విపత్తు వచ్చినప్పుడు ప్రజలు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఎదుర్కొనేలా వారిని సన్నద్ధం చేయడమే క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ గురువారం రిలీజ్ చేసింది.
ఏఏ వస్తువులు సమకూర్చుకోవాలంటే..?
'బీ రెడీ' ఇనిషియేటివ్‌లో భాగంగా ప్రతి ఇంట్లోనూ మూడు రోజులకు సరిపడా వాటర్, చెడిపోని ఆహార పదార్థాలు, ఫ్లాష్‌లైట్, అదనపు బ్యాటరీలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, అత్యవసర సమాచారం తెలుసుకోవడానికి బ్యాటరీతో పనిచేసే రేడియో వంటి వస్తువులను సమకూర్చుకోవాలని ప్రజలకు బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. అలాగే డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, ఏటీఎంలు పనిచేయని సమయాల్లో అవసరమయ్యేలా కొంత క్యాష్, చలి నుంచి రక్షణ కోసం వెచ్చని దుస్తులు, స్లీపింగ్ బ్యాగులను దగ్గర ఉంచుకోవాలని తెలిపింది.
అత్యవసర పరిస్థితుల్లో దుకాణాలు, ఆన్లైన్ సర్వీసెస్, ఇతర సౌకర్యాలపై ఆధారపడకుండా ప్రజలు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా ఇలాంటి అత్యవసర మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదంతా ఎందుకు..!
వాతావరణ మార్పులతో ఇటీవల బ్రిటన్‌లో ఎండలు, కరువులు, కార్చిచ్చులు పెరిగిపోవడం.. మరోవైపు, సైబర్ దాడులు డిజిటల్ భద్రతపై ఆందోళనలు పెరగిన నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇలా ముందస్తు చర్యలు చేపట్టింది. కార్చిచ్చులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైనిక హెలికాప్టర్లను సన్నద్ధం చేయడంతో పాటు అగ్నిమాపక సేవల కోసం దాదాపు 45 మిలియన్ల పౌండ్ల నిధులను కేటాయించింది. ఇది ప్రజల్లో భయాన్ని సృష్టించడానికి కాదని, ప్రాథమికంగా సిద్ధం కావడానికి మాత్రమేనని ప్రభుత్వం సమర్థించుకుంది. ప్రజలు ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
