హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బార్ కౌన్సిల్ 774 మంది న్యాయ పట్టభద్రుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను శనివారం నిర్వహించింది. వీరిలో 737 మంది న్యాయవాదులు మధ్యంతర నమోదు కమిటీ పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం చేశారు. భారత బార్ కౌన్సిల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ సముల రామ్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ వెంకట్ యాదవ్ చలకాని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత బార్ కౌన్సిల్ సభ్యుడు జి. కిరణ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుత లోకాయుక్త ఛైర్మన్ జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై నూతన న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయవాదిగా పనిచేసిన అనుభవంతోపాటు హైకోర్టు న్యాయమూర్తిగా తన సుదీర్ఘ ప్రస్థానంలో అనుభవాలను వివరించారు. బార్ కౌన్సిల్ సభ్యులు మధుసూదనరావు ధన్వాడ, శ్రీనివాసరావు మండదపు, డి. రాఘవులు నూతన న్యాయవాదులకు వృత్తిపరమైన సూచనలు చేశారు.
