వీళ్లు మామూలు దొంగలు కాదు. చిన్నా చితకా దొంగతనాలు కాకుండా.. ఎవరికీ డౌట్ రాకుండా.. ఏకంగా వేర్ హౌస్ పైనా కన్నేశారు. షోరూమ్ లో దొంగతనం చేసేకంటే.. వేర్ హౌస్ లో అయితే రకరకాల విలువైన వస్తువులుంటాయి.. అనుకున్నారో ఏమో. ఏకంగా కోటి రూపాయల సరుకును కొట్టేశారు. గుజరాత్ లో జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది.
అహ్మదాబాద్ జిల్లా సనతల్ సర్కిల్ సమీపంలోని నవాపురా గ్రామ సమీపంలో ఉన్న ఇంగ్రామ్ మైక్రో వేర్‌హౌస్‌లో 2026 అక్టోబర్ 21 రాత్రి జరిగిన ఈ దొంగతనంలో లో సుమారు రూ.1 కోటి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఎత్తుకెళ్లారు దొంగలు.
సుమారు ముగ్గురు ముసుగు వేసుకున్న దొంగలు వేర్‌హౌస్ వెనుక భాగంలోని తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. మాస్కులు పెట్టుకుని వచ్చిన దొంగలు సెలెక్టెడ్ గా విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు.
40 ఐఫోన్లు, 15 డెల్ ల్యాప్‌టాప్‌లు , 11 హెచ్‌పి ల్యాప్‌టాప్‌లు , 36 యాపిల్ వాచ్‌లు , 20 ఐప్యాడ్ కీబోర్డ్‌లు , ఐప్యాడ్ ప్రో పరికరాలు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు, ఇతర యాక్సెసరీలు మొత్తం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు.
అక్టోబర్ 21 రాత్రి 1 గంట నుంచి 2.30 గంటల మధ్య ఘటన జరిగింది. వెనుక తలుపులు బద్దలు కొట్టబడి ఉండటం, కొన్ని ప్యాకేజీలు దెబ్బతిని ఉండటం సెక్యూరిటీ గార్డు గమనించి వేర్‌హౌస్ మేనేజర్ సుధీర్ నాయర్‌కు సమాచారం ఇచ్చారు. నాయర్ వచ్చి పరిశీలించిన తర్వాత పెద్ద మొత్తంలో వస్తువులు తప్పిపోయినట్లు తెలిసింది.
పోలీసు విచారణ
చంగోదర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అహ్మదాబాద్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీవైఎస్‌పీ) నీలం గోస్వామి మాట్లాడుతూ, అనుమానితులను గుర్తించి అరెస్టు చేయడానికి అనేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దొంగలు వేర్‌హౌస్ వెనుక ఉన్న ఖాళీ స్థలం గుండా ప్రవేశించి, వస్తువులు దొంగిలించిన తర్వాత రోడ్డు మార్గంలో పారిపోయినట్లు తెలుస్తోంది.
