కార్మికులతోనే ఉంటా.. కష్టసుఖాల్లో పాలుపంచుకుంట: ఎంపీ వంశీ

కార్మికులతోనే ఉంటా.. కష్టసుఖాల్లో పాలుపంచుకుంట: ఎంపీ వంశీ

పెద్దపల్లి: కార్మికులకు అండగా ఉంటానని.. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం (అక్టోబర్ 25) పెద్దపల్లిలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ దశాబ్ధి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లిలో హమాలీ కార్మికుల ఐక్యత బాగుందన్నారు. కార్మికుల గురించి మాట్లాడితే మొదటగా మా తాతగారు కాక వెంకటస్వామి గుర్తుకు వస్తారని చెప్పారు. కార్మికుల కష్టసుఖాలు తెలుసుకొని కార్మికుల పక్షాల నిలబడిన వ్యక్తి కాక అని అన్నారు.

కార్మికుడి రక్తంలోనే ఉద్యమం ఉంటుందని.. అందుకే వాళ్ళు అదే స్ఫూర్తితో హక్కుల కోసం పోరాటాలు చేస్తారన్నారు. తెలంగాణ కోసం బుల్లెట్ గాయాలను కూడా లెక్కచేయని కాక కార్మికుల పక్షపాతిగా నిలిచాడని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి వివేక్ వెంకటస్వామి, ప్రొఫెసర్  కోదండరాం లాఠీ దెబ్బలు తిన్నారని చెప్పారు. 

కాకా మొదలుపెట్టిన పెన్షన్‎ని 30 ఏళ్లయిన పెంచకుండా అదే పెన్షన్ ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల కోసం పార్లమెంటులో తాను గళం విప్పుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు కార్మికుల సంక్షేమ బోర్డు లేదంటే సిగ్గుచేటన్నారు. 

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హమాలీల కోసం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఒక ప్రత్యేక 'నేషనల్ హమాలీ వెల్ఫేర్ బోర్డ్' ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో కోరుతానన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‎లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.