హైదరాబాద్ రామంతాపూర్ కాలనీలో పేలుడు కలకలం రేపింది. రామంతాపూర్ చర్చి కాలనీలోని ఓ స్క్రాప్ షాపులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆదివారం ( అక్టోబర్ 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. స్క్రాప్ షాపులో లోహాన్ని కట్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు సమయంలో భారీగా మంటలు చెలరేగాయి.
ఈ అఘటనలో స్క్రాప్ డీలర్ పరశురామ్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరశురామ్ ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితుడి శరీరం సుమారు 70 శాతం కాలిందని... ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. ఈ ఘటనపై సమాచారం ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పేలుడు సంభవించిన స్క్రాప్ షాపు ఇళ్ల మధ్యలో ఉండటంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. పేలుడు సమయంలో భారీగా శబ్దం కూడా వచ్చిందని అంటున్నారు. ఘటన జరిగిన సమయంలో దట్టమైన పొగ పరిసరాలను కమ్మేసింది. స్క్రాప్ డీలర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
