ఢిల్లీలోని వికాస్‌పురిలో ఉన్న ఓ మద్యం షాపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళలు మద్యం కొనుగోలు చేసేందుకు ఈ షాపులో ఓ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ కౌంటర్‌లో చేసిన గులాబీ రంగు అలంకరణలు, హలో కిట్టి స్టిక్కర్లు, టెడ్డీ బేర్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
గులాబీ రంగులో ప్రత్యేక కౌంటర్
‘గవర్నమెంట్ వైన్ అండ్ బీర్ షాప్’ పేరుతో ఉన్న ఈ షాపు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను చూపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది ఈ కొత్త ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ దుకాణం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సాధారణంగా మద్యం షాపుల్లో కనిపించే కౌంటర్లకు భిన్నంగా, ఇక్కడ మహిళల కోసం ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేశారు. దీనికి గులాబీ రంగు అలంకరణలు చేశారు. హలో కిట్టి స్టిక్కర్లు, చిన్న చిన్న టెడ్డీ బేర్‌లతో అందంగా ముస్తాబు చేశారు. ఈ అలంకరణలే వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మహిళలకు మరింత సౌకర్యంగా ఉండేలా..
మహిళలు మద్యం కొనుగోలు చేసేటప్పుడు మరింత సౌకర్యంగా ఉండేలా ఈ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు షాపు తెలిపింది. మహిళలు కూడా ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేసుకునేలా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే మా ఉద్దేశమని పేర్కొంది.
ఈ కౌంటర్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, కస్టమర్లకు సురక్షితమైన, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యమని వివరించింది.
సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రత్యేక కౌంటర్ ఆలోచనను ప్రశంసిస్తుండగా, మరికొందరు షాపు డెకరేషన్ పై సరదా సరదా కామెంట్లు చేస్తున్నారు.
ఒకరు టెడ్డీ బేర్‌లతో చేసిన అలంకరణ చాలా బాగుందని కామెంట్ చేయగా... మరొకరు ‘‘ఇప్పుడే వికాస్‌పురికి బయలుదేరుతున్నా’’ అంటూ సరదాగా రిప్లయ్ ఇచ్చారు. ఇంకొకరు మహిళలు ఇతరులపై ఆధారపడకుండా వారికీ కావాల్సినవి స్వయంగా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. మరికొందరు మహిళలు ఇకపై ప్రత్యేక కౌంటర్‌లో కొనుగోళ్లు చేయవచ్చని, పొడవైన క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
