ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చేందుకు కృషి చేస్తాం: మంత్రి వివేక్

ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చేందుకు కృషి చేస్తాం: మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లా, వేంపల్లి: ముదిరాజ్ సామాజిక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ముదిరాజ్‌లను ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో నిర్వహించిన ముదిరాజ్ సింహ గర్జన సభకు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు.

సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగ రంగాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదన్నారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలనేది ఆ సామాజిక వర్గం దశాబ్దాలుగా చేస్తున్న ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. బీసీ-డీ కేటగిరీలో ఉండటం వల్ల ముదిరాజ్ యువతకు అన్యాయం జరుగుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ముదిరాజ్ హక్కుల సాధన కోసం బండ ముదిరాజ్ నిరంతరం పోరాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్‌కు ఏటా బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడంతో పాటు, కులవృత్తుల ఆధునీకరణకు, యువత స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

చెన్నూరులో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. భవన నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. అదనంగా ముదిరాజ్ సంఘ భవనానికి ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయించేందుకు ముందుకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ముదిరాజ్ యువత తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM)ను సంప్రదించాలని సూచించారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు, భాషలో శిక్షణ అందించి జర్మనీ, జపాన్ వంటి దేశాలకు వెళ్లే అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ముదిరాజ్‌ల ఐక్యతతోనే అభివృద్ధి: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4,800 ముదిరాజ్ కుల సంఘాల కమిటీలకు ఎన్నికలు నిర్వహించేలా కృషి చేస్తామని తెలిపారు. ముదిరాజ్‌లు ఐకమత్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవడంతో పాటు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ముదిరాజ్ సంఘ సభ్యులకు బీమా పథకం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాలలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణకు సహకరిస్తానని, తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ముదిరాజ్ సామాజిక వర్గానికి అండగా ఉంటానని, వారి అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. ముదిరాజ్‌ల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సంఘటితంగా హక్కుల సాధన వంటి అంశాలు సభలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.