కాశీలో వింగ్స్ ఓవర్ ది గంగా.. ఆకట్టుకున్న యుద్ద విమానాల ప్రదర్శన..తిలకించేందుకు 10లక్షలమంది వచ్చారు 

కాశీలో వింగ్స్ ఓవర్ ది గంగా.. ఆకట్టుకున్న యుద్ద విమానాల ప్రదర్శన..తిలకించేందుకు 10లక్షలమంది వచ్చారు 

భారత వైమానిక దళం 94 వ వార్షికోత్సవం సందర్భంగా యూపీలోని కాశీ(వారణాసి) లో వైమానిక విమానాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. గంగా నదిపై యుద్ద విమానాల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. రఫేల్, సుఖోయ్, ఎంకేఐ, తేజస్ వంటి యుద్ద విమానాలతో పాటు హెలికాప్టర్లు, రవాణా విమానాలు, ఏరోబాటిక్ టీమ్స్ ఆకాశంలో చేసిన అద్భుత విన్యాసాలు ఈకార్యక్రమానికి హైలైట్ గా నిలిచాయి. కాశీలో ని నమో ఘాట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు పది లక్షల మంది వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 
  
భారత వైమానిక దళం 94 వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్   22, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు గంగానది తీరంలోని నమో  ఘాట్ లో  వింగ్స్ ఓవర్ ది గంగా పేరుతో ఈ వైమానిక అద్భుత ప్రదర్శన జరిగింది. నమో ఘాట్  మెట్లపై కూర్చొని లక్షలాది మంది ప్రదర్శనను ఆస్వాదించారు. చివరిరోజైన అక్టోబర్ 25న  ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. 

‘వింగ్స్ ఓవర్ ది గంగా’ ఎందుకు..?

భారత వైమానిక దళం కేవలం యుద్ధ విమానాల శక్తినే కాకుండా, పైలట్ల శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర సమయాల్లో స్పందించే సామర్థ్యం, వివిధ దళాల మధ్య సమన్వయాన్ని కూడా ఈ ప్రదర్శన ద్వారా చాటిచెబుతోంది. స్వదేశీ తేజస్, ధ్రువ్ వంటి విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శన భారత రక్షణ రంగంలో దేశీయ సాంకేతికత ప్రాధాన్యాతను తెలియజేస్తుంది.

గంగానది తీరంలోని ఆధ్యాత్మిక నగరం కాశీ(వారణాసి)లో యుద్ధ విమానాల గర్జనలు, హెలికాప్టర్ల విన్యాసాలు, త్రివర్ణ రంగుల దృశ్యాలు కలగలిసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. భారత వైమానిక దళం 94 ఏళ్ల ప్రస్థానాన్ని, దేశ రక్షణలో దాని పాత్రను ప్రజలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ప్రదర్శనకు భారీ భద్రత ఏర్పాట్లు..

ఈ కార్యక్రమానికి 15నుంచి 20 లక్షల మంది ప్రేక్షకులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా వారణాసిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.  సుమారు 11వేల900 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.79 తాత్కాలిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు, వాచ్‌టవర్లు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, జల పోలీసు బృందాలను అప్రమత్తం చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం ఎనిమిది తాత్కాలిక ఆస్పత్రులు,100 అంబులెన్సులను సిద్ధం చేశారు.

 ప్రదర్శన సమయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గంగానదిలో ప్రైవేట్ పడవల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఘాట్లకు సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో అనుమతి లేని డ్రోన్ల ఎగురవేతను నిషేధించారు.