సెన్సార్ బోర్డులో కలకలం: 500కుపైగా సినిమాల డేటా లీక్‌.. అసలు CBFCలో ఏం జరిగింది?

సెన్సార్ బోర్డులో కలకలం: 500కుపైగా సినిమాల డేటా లీక్‌.. అసలు CBFCలో  ఏం జరిగింది?

సినిమా విడుదలకు ముందు కథను గోప్యంగా ఉంచడం మేకర్స్‌కు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ సినిమాలకు సర్టిఫికెట్లు ఇచ్చే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్‌ (CBFC)కు చెందిన పోర్టల్‌లోనే వందల చిత్రాలకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు వచ్చినట్లు వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 500కుపైగా సినిమాలకు సంబంధించిన రికార్డులు బహిర్గతమైనట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో సినిమా కథల నుంచి వ్యాపార ఒప్పందాల వరకు.. అసలు ఏయే వివరాలు బయటకు వచ్చాయన్న ఆసక్తి నెలకొంది.

స్క్రిప్టుల నుంచి ఒప్పందాల వరకు..

సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు నిర్మాతలు సమర్పించే పత్రాలను సీబీఎఫ్‌సీ ‘ఈ-సినీప్రమాణ్‌’ (e-Cinepramaan) పోర్టల్ ద్వారా స్వీకరిస్తుంది. అయితే ఈ పోర్టల్‌కు సంబంధించిన రికార్డులు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వీటిలో సినిమా స్క్రిప్టులు, సెన్సార్ కట్ ఆర్డర్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు సమాచారం. కొన్ని విదేశీ చిత్రాలకు సంబంధించిన భారతీయ పంపిణీ ఒప్పందాలు, లైసెన్సింగ్ ఫీజుల వివరాలు కూడా బహిర్గతమైనట్లు కథనాలు వెల్లడించాయి.

నిర్మాతలకు అసలు సమస్య ఇదే!

సినిమా కథ ముందే బయటపడితే ప్రేక్షకుల్లో ఉత్కంఠ తగ్గే ప్రమాదం ఉంది. అదే సమయంలో పంపిణీ ఒప్పందాలు, లైసెన్సింగ్ ఫీజుల వంటి వ్యాపార వివరాలు బహిర్గతమైతే నిర్మాతలు, పంపిణీదారుల మధ్య జరిగే భవిష్యత్తు బేరసారాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ ఘటన కేవలం డేటా లీక్‌గానే కాకుండా.. సినిమా పరిశ్రమలో సమాచార గోప్యతకు సంబంధించిన అంశంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

రంగంలోకి దిగిన అధికారులు

ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత సంబంధిత పత్రాలను తొలగించినట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్‌ తెలిపింది. సైబర్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించింది. మరోవైపు, సీబీఎఫ్‌సీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి, తన పోర్టల్ భద్రతపై ఆడిట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ప్రాథమిక పరిశీలనలో పత్రాలను ఇతరులు యాక్సెస్ చేసినట్లు ఆధారాలు లభించలేదని, చిత్రనిర్మాతల వ్యక్తిగత ఖాతాలు హ్యాక్ అయినట్లు కూడా కనిపించడం లేదని బోర్డు తెలిపినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

డిజిటల్ భద్రతపై కొత్త ప్రశ్నలు

సినిమా సర్టిఫికేషన్ కోసం ప్రభుత్వ పోర్టల్‌లో సమర్పించే పత్రాలు కేవలం అధికారిక రికార్డులు మాత్రమే కాదు. వాటిలో సినిమా కథలు, నిర్మాతల సృజనాత్మక ఆలోచనలు, పంపిణీ వివరాలు, ఆర్థిక ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. ఇలాంటి సమాచారాన్ని భద్రంగా ఉంచడం సంబంధిత సంస్థల బాధ్యత. ఈ ఘటనలో సైబర్ దాడి జరిగిందా? లేదా పోర్టల్‌లోని భద్రతా లోపాల కారణంగా పత్రాలు బయటకు వచ్చాయా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే, కీలక పత్రాలను అనధికారికంగా ఎవరూ యాక్సెస్ చేయకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవడం, వాటి వినియోగాన్ని పర్యవేక్షించడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, సీబీఎఫ్‌సీ నిర్వహిస్తున్న భద్రతా ఆడిట్‌లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను డిజిటల్ విధానంలో నిర్వహించడం వల్ల సమయం ఆదా అవుతున్నప్పటికీ, అందులో సమర్పించే పత్రాల గోప్యతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవడం కీలకంగా మారింది.