ఈ తరం పోరలకు లగ్జరీల పిచ్చి ఎలా ఉందో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. డబ్బులు లేకున్నా.. స్థోమత లేకున్నా.. మెయింటైన్ చేసే వయసు లేకున్నా వాటిని వాడాలనే పిచ్చితో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఐ ఫోన్, థార్ లపై వీళ్లకున్న మోజు దొంగతనాలు చేయించే వరకు తీసుకెళ్తోంది. మహారాష్ట్రలో ఒక యువకుడు తన సొంత మామ ఇంట్లోనే లూటీ చేసి థార్ కొనడమే కాకుండా.. మామను ఓపెనింగ్ పిలిచి దొరికిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఒక గ్రామంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు తన మామ ఇంట్లోని బంగారం కొట్టేసి దానితో మహీంద్రా థార్ కారు కొని, ఆ కారు పూజకు అదే మామను ఆహ్వానించాడు. సమర్ చవాన్ అనే ఈ యువకుడు తన మామ ఉమేష్ మారుతి చవాన్ ఇంటి నుంచి 150 గ్రాముల బంగారం దొంగిలించాడు. ఆ నగలను రూ.10 లక్షలకు అమ్మి థార్ ఎస్‌యూవీ కొన్నాడు.
ఏం జరిగింది?
కారు పూజకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఉమేష్ తన భార్య నగలు తప్పిపోయినట్లు గమనించాడు. కుటుంబ సభ్యులు లోపలి వ్యక్తి చేసిన పని కావచ్చని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్‌పీ శ్రీకాంత్ థికానే నేతృత్వంలోని పోలీసు టీమ్ విచారణ చేపట్టింది.
సమర్ హఠాత్తుగా ఖరీదైన కారు కొనడానికి డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందన్న అనుమానంతో విచారణ సాగించారు. విచారణలో సమర్ నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు సమర్‌ను అరెస్టు చేశారు. బంగారం కొన్న స్వర్ణకారుడిని కూడా అరెస్టు చేశారు. థార్ కారును స్వాధీనం చేసుకున్నారు.
