ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి పొంగులేటి

ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా: ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.38 కోట్ల వ్యయంతో మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రహదారి పనులతో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా రూ.కోటి వ్యయంతో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మద్దులపల్లి నుంచి గొల్లగూడెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం రూ.75.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని, మొత్తం సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటాయింపులు జరిగాయన్నారు. రహదారులు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధితో పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని అన్నారు.

ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత పాలకుల హయాంలో ఏర్పడిన ఆర్థిక అవరోధాలను అధిగమిస్తూ పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పరిస్థితులు తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.

వానాకాలంలో రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని చెప్పారు. పంటలకు అవసరమైన నీరు, విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న కాలంలో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితులను గతంలో ఎదుర్కొన్న అనుభవం రైతులకు ఉందని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా తెలంగాణకు వివక్ష లేకుండా సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన మద్దతు లభించేలా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.