ఆవులతో అనుబంధం.. మనసుకు ప్రశాంతత! సిటీ లైఫ్ లో ఒత్తిడిని దూరం చేసే కౌ హగ్ థెరపీ...

ఆవులతో అనుబంధం..  మనసుకు ప్రశాంతత! సిటీ లైఫ్ లో ఒత్తిడిని దూరం చేసే కౌ హగ్ థెరపీ...

ఉరుకులు పరుగుల జీవితం... పని ఒత్తిళ్లు... ఉక్కిరిబిక్కిరి చేసే ఆలోచనలు! వీటన్నింటినుంచి కాసేపైనా ఉపశమనం పొందాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం కొందరు ప్రకృతి ఒడికి చేరుతుంటే.. మరికొందరు మూగజీవాలతో మమేకమవుతున్నారు. అలా హైదరాబాద్‌ నగర శివార్లలో దేశీ ఆవులతో అనుబంధాన్ని పెంచుకుంటూ మానసిక ప్రశాంతత పొందే కొత్త అనుభవానికి తెరతీశారు. అదే... కౌ హగ్ థెరపీ!

నగర జీవితంలో ఒత్తిడికి గురైన వారు దాన్ని దూరం చేసుకుని ఒకింత ఊరట పొందటానికి కౌడ్లింగ్ థెరపీ చేయించుకుంటున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని గో దేశీ ఫామ్​హౌస్​లో గిర్ దేశీ ఆవులను ఆప్యాయంగా హత్తుకునే చికిత్స పొందడం ద్వారా నగరవాసులు మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. పచ్చని తోటలో శాంత స్వభావం కలిగిన దేశీ ఆవులతో  గడపడం, వాటిని నిమరడం, హత్తుకోవడం, బ్రష్ చేయడం, ప్రశాంతమైన సమయాన్ని ఆవులతో గడపడం వంటివి ఈ థెరపీలో ఉంటాయి. దేశీ ఆవులతో అనుసంధానం ప్రశాంతమైన ఆవును ఆనుకుని ఉండటం వల్ల ఆక్సిటోసిన్ అనే ప్రేమను కలిగించే హార్మోన్ విడుదలవుతుందని, దీనివల్ల ఒత్తిడి స్థాయి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.

హైదరాబాద్‌‌లోని ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు అందించాలనే లక్ష్యంతో గోదేశీ గోశాలను మాదాసు వీరేందర్, మాదాసు సుష్మ రేవత్కర్ దంపతులు ప్రారంభించారు. చుట్టూ పచ్చని చెట్లు.. గడ్డి పొలాలు.. హైదరాబాద్ నగరానికి, కాలుష్యానికి దూరంగా.. గ్రామీణ వాతావరణంలో ఉన్న చిలుకూరు ప్రాంతంలో గోదేశీ గోశాల.. ఇందులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిర్ ఆవులు, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంక్రీజ్ జాతులకు చెందిన వందకు పైగా దేశీ ఆవులతో కూడిన గోశాల నగరవాసులకు కౌ హగ్గింగ్ థెరపీని అందిస్తోంది. 

హైదరాబాద్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200కు పైగా ఉండగా, నగర శివార్లలోని గోశాలలో ఏక్యూఈ 30 ఉండటంతో స్వచ్ఛమైన గాలి వీస్తోంది. ప్రజల డిమాండ్ మేరకు తాము గోదేశీ గోశాలలో కౌ హగ్గింగ్ థెరపీని ప్రారంభించామని ఆ సంస్థ ప్రతినిధి శ్రీధర్ చెప్పారు. ఇప్పటివరకు కౌ థెరపీ కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు. నెలకు 50 మందికి పైగా వస్తున్నారనిఆయన తెలిపారు.

కొవిడ్ సమయంలో కౌ హగ్ థెరపీ

కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో హైదరాబాద్ నగరంలో ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. బ్లడ్ ప్రషర్ పెరగడంతోపాటు తీవ్ర యాంగ్జయిటీకి గురయ్యారు. అలాంటి సమయంలో చిలుకూరు ప్రాంతంలోని తమ గోదేశీ గోశాలలో కౌ హగ్ థెరపీని ప్రారంభించామని చెప్పారు గోశాల నిర్వాహకులు వీరేందర్. 

కొవిడ్ సమయంలో నగర ప్రజలు ఎందరో తమ గోశాలకు వచ్చి ఆవులను కౌగిలించుకోవడం ద్వారా ఒత్తిడి, యాంగ్జయిటీ, బీపీ తగ్గించుకోగలిగారని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఒత్తిడికి గురైన వివిధ వర్గాలు, ఐటీ ఉద్యోగులు, 45 ఏళ్ల వయసు పైబడిన వారు కౌ హగ్గింగ్ థెరపీ కోసం వస్తున్నారని వీరెందర్ చెప్పారు. శిక్షణ పొందిన ఆవులతో ఈ  థెరపీ చేయిస్తున్నామని ఆయన తెలిపారు.

పరిశోధనల్లో తేలిన నిజం

ఆవును మెల్లగా నిమరడం, బ్రష్ చేయడం, గోకడం, ఆవు పక్కన కూర్చోవడం, మెల్లగా మాట్లాడటం, ఆవు ప్రవర్తనను గమనించడం, శారీరక స్పర్శ, ప్రశాంతమైన వ్యవసాయ క్షేత్ర వాతావరణంలో సమయం గడపడం, ఆవు శ్వాస, కదలిక, వెచ్చదనం, శబ్దాలు, సున్నితమైన స్పర్శకు దాని ప్రతిస్పందన మనుషుల్లో ఏకాగ్రతను ప్రోత్సహిస్తుంది. చాలామందికి ఈ అనుభవం స్థిరత్వాన్ని, శాంతిని, భావోద్వేగ సంతృప్తిని కలిగిస్తుందని18 మంది నర్సింగ్ విద్యార్థినుల తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన ఫలితాలు మానవ- ఆవుల మధ్య పరస్పర చర్యపై పెరుగుతున్న శాస్త్రీయ ఆసక్తికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మనుషులు సహజంగానే జంతువులతో భావోద్వేగ బంధాలను ఏర్పరచుకుంటారు. 

ఒక సాధు జంతువుతో ప్రశాంతమైన అనుబంధం అనుభూతులను కలిగిస్తుంది. ఓదార్పు, ఆనందం, వెచ్చదనం, జిజ్ఞాస, శాంతి చాలా మంది సందర్శకులకు ఒక చిరస్మరణీయమైన భావోద్వేగ బంధంగా మారుతుంది. కేథరీన్ కాంపిటస్, సోన్యా ఎం. బీర్‌బౌవర్ చేసిన పరిశోధనల్లో కౌ థెరపీ ఉత్తేజకరమైన కోణాన్ని తీసుకువచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి సువెందు అధికారి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే నాడియా జిల్లా మాయాపూర్ లోని ఇస్కాన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న గోశాలను సందర్శించారు. 

అధికారి ఒక చాపపై కూర్చుని, ఆవుకు బ్రష్ చేస్తూ కనిపించారు.ఇస్కాన్‌లోలా కాకుండా గోవులను లాలించడం, ఆలింగనం చేసుకోవడం, వాటిని నిమరడం, మేత పెట్టడం, వాటితో మమేకమవ్వడం వంటి థెరపీ సెషన్‌లను విదేశీయులు సైతం బుక్ చేసుకుంటున్నారు. ఇలాంటి జంతు సహాయక చికిత్సా అనుభవాలు ఒకప్పుడు నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండేవి. 

ప్రస్థుతం కౌ హగ్గింగ్ థెరపీ భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలో ఆవును ఎప్పటినుంచో తల్లిలా పూజిస్తున్నప్పటికీ, వాటిని కౌగిలించుకోవడం లేదా ముద్దు చేయడం అనేది బయటి నుంచి వచ్చిన ఆరోగ్య ఫ్యాషన్ కాదు. భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఆవులను సహజసిద్ధంగా కౌగిలించుకుంటున్నారు, ముద్దు చేస్తున్నారు. 

చాలామంది భారతీయులకు, ఆవును కౌగిలించుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. గత 5-6 సంవత్సరాలుగా భారతదేశంలో ఆవును కౌగిలించుకోవడం ఒక వెల్​నెస్ ట్రెండ్‌గా మారింది. అయితే, మరింత ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకునే వారి కోసం, వ్యవస్థీకృత ఆవు-కౌగిలి సెషన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర గంటకు కొన్ని వందల రూపాయల నుంచి మొదలవుతుంది.

విదేశాల్లో సైతం...

ఒత్తిడి, ఆందోళన, మానవ-జంతు పరస్పర చర్య, భావోద్వేగ శ్రేయస్సుకు సంబంధించి ఆవు కౌగిలింత తోడ్పడుతుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీలో ప్రచురితమైన వ్యాసం వెల్లడించింది. అమెరికాలోనూ ఆవు కౌగిలింతలకు గంటకు 200 డాలర్లు చార్జి చేస్తున్నట్లు అంతర్జాతీయ టీవీ చానల్స్​లో వీడియోలు వచ్చాయి. ప్రజల ఒత్తిడిని తగ్గించడానికి కౌ థెరపీ ఉపయోగపడుతుందని అమెరికన్లు సైతం చెప్తున్నారు. ఆవును హగ్గింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగకరమైన ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు విడుదలై ఒత్తిడి దూరమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. విదేశాలలో ప్రజలు ఆవులను కౌగిలించుకోవడానికి వందల డాలర్లు చెల్లిస్తున్నారు.

గోవు కౌగిలి దినం

వాలెంటైన్స్ డే నాడు గోవులను ప్రేమించే వారందరూ ఆవును కౌగిలించుకోవాలని భారత ప్రభుత్వమే కోరింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక,పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భారత జంతు సంక్షేమ మండలి ఫిబ్రవరి14వ తేదీని గోవు కౌగిలి దినంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.ఆవును కౌగిలించుకోవడం భావోద్వేగ పరిపూర్ణతను తెస్తుందని, తద్వారా మన వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుందని మండలి  తన వెబ్‌సైట్‌లో, సోషల్ మీడియాలో పోస్టు చేసిన నోట్​లో పేర్కొంది.

ప్రయోజనాలెన్నో.. 

ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి స్వదేశీ గిర్ ఆవులతో అనుసంధానమయ్యేలా రూపొందించిన కౌ కడ్లింగ్ థెరపీ సెషన్లను గోదేశీ గోశాల అందిస్తుంది. శాంత స్వభావం కలిగిన దేశీ ఆవులతో గడపడం, వాటిని నిమరడం, హత్తుకోవడం, 

బ్రష్ చేయడం, ప్రశాంతమైన సమయాన్ని గడపడం వంటివి ఇందులో ఉంటాయి. దేశీ ఆవులతో అనుసంధానం వల్ల ఆక్సిటోసిన్​ ప్రేమను కలిగించే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో ఒత్తిడి స్థాయి తగ్గుతుంది.మరోవైపు, ప్రకృతి మధ్య గడపడం.. ఫోన్‌లు, హడావుడికి కాసేపు దూరంగా ఉండటం..  మూగజీవాలతో అనుబంధాన్ని పెంచుకోవడం వంటివి మనసుకు హాయినిచ్చే అవకాశాలున్నాయి. అందుకే నగరవాసులు ఈ వినూత్న అనుభవం వైపు ఆసక్తి చూపుతున్నారు. 

ఆవును కౌగిలించుకోవడం...

ఆధునిక జీవితం వేగంగా సాగిపోతోంది. ఎక్కువ పని గంటలు, డిజిటల్ తెరలు, రద్దీగా ఉండే పట్టణ వాతావరణం, నిరంతర ప్రేరణ వల్ల, కాస్త నెమ్మదించి శ్వాస తీసుకుని, ప్రకృతితో మమేకమవడానికి చాలా తక్కువ సమయం మిగులుతుంది. ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి జంతువుల సహాయంతో చేసే కార్యకలాపాలు, వ్యవసాయ ఆధారిత ఆరోగ్యం , హరిత సంరక్షణ అనుభవాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. 

జంతువుల సహాయంతో చేసే పరిశోధనల్లో కుక్కలు, గుర్రాలు, ఆవులు సంప్రదాయకంగా అత్యంత సుపరిచితమైన జంతువులుగా ఉన్నాయి. తరతరాలుగా భారతీయులు ఆవులను గోమాతగా పిలుస్తుంటారు. ఆవును కౌగిలించుకోవడం ఒక అందమైన, సరళమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆవులతో ప్రశాంతంగా, అర్థవంతంగా సమయం గడపడం మానవుల మానసిక శ్రేయస్సుకు తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఒత్తిడి దూరం

ఆవును కౌగిలించుకోవడం, దాని శరీరాన్ని నిమురుతూ అనుభూతి పొందడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని గోదేశీ గోశాల నిర్వాహకులు వీరేందర్ చెప్పారు. ఆవులను హగ్ చేసుకోవడంతోపాటు వాటికి గడ్డి తినిపించడం, స్వయంగా వాటి పాలను చేతులతో పితికి వాటిని వేడి చేసుకొని తాగవచ్చని చెప్పారు. ఈ కౌ హగ్గింగ్ థెరపీకి ఒక్కొక్కరికి గంట సమయానికి 1000 రూపాయలు చార్జి చేస్తున్నామని వీరేందర్ వివరించారు. 

భార్య, పిల్లలను కౌగిలించుకుంటే కలిగే ఆనందం లాగా ఆవులను కౌగిలించుకుంటే ఒత్తిడి దూరమవుతుందంటారు నిపుణులు. ఆవులను కౌగిలించుకునే సెషన్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. సందర్శకులు తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలి. థెరపీకి వచ్చిన వారు గోశాలలో పండించిన గడ్డిని ఆవులకు తినిపించొచ్చు. వాటిని శుభ్రం చేయొచ్చు. పూజల్లో పాల్గొనొచ్చు. ‘‘ఆవులతో ఒంటరిగా ప్రశాంతంగా గడపడానికి కూడా ఎంచుకోవచ్చు. వారు తరచుగా ఆవులను కౌగిలించుకుంటారు, వాటితో మాట్లాడతారు” అని గోదేశీ గోశాల మేనేజర్‌ అఖిల్ చెప్పారు.