Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10: ఏడో వారం డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలిని ఔట్.. త్రిగుణ్‌కు నాగార్జున వార్నింగ్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10: ఏడో వారం డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలిని ఔట్.. త్రిగుణ్‌కు నాగార్జున వార్నింగ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఏడో వారం ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభించింది. హాస్ట్ నాగార్జున ముందుగానే చెప్పినట్లుగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ జరగ్గా.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దక్షి, సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి వచ్చిన షాలిని హౌస్‌ను వీడారు. అయితే ఈ రెండు ఎలిమినేషన్ల వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆదివారం ఎపిసోడ్‌లో తొలుత వర్షిణి, శివ్‌ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా దక్షి ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. స్టేజ్‌పైకి వచ్చిన దక్షి.. నీతూకి ఎక్కువగా వినాలని, అమన్‌కు ఇతరులను గమనించాలని, త్రిగుణ్‌కు మాటలు అదుపులో పెట్టుకోవాలని సూచించింది. శ్వేతకు మాత్రం తనలా ధైర్యంగా మాట్లాడాలని సలహా ఇచ్చింది. వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన దక్షి.. ఆటలో బలమైన ముద్ర వేయలేకపోవడమే ఆమెకు మైనస్‌గా మారినట్లు కనిపిస్తోంది.

ఇక అసలు ట్విస్ట్ షాలిని ఎలిమినేషన్‌తో మొదలైంది. రెడ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎల్లో జోన్ సభ్యులు కొందరిని సేఫ్ చేయగా, మిగిలిన వారికి గ్రీన్ జోన్ సభ్యులు ఎగ్జిట్ బ్యాడ్జీలు పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో నీతూ, దేబ్జానీ, త్రిగుణ్‌ షాలినికి బ్యాడ్జీలు పెట్టడంతో ఆమె ప్రయాణం ముగిసింది. బయటకు వెళ్లే సమయంలో రోహిత్‌తో హగ్ చేసుకోవడం, చెవిలో 'ఐ లవ్యూ' చెప్పడం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. స్టేజ్‌పైకి వెళ్లాక రోహిత్ విన్ అవ్వాలని ఉందని షాలిని చెప్పింది.

మరోవైపు త్రిగుణ్‌ ప్రవర్తనపైనా నాగార్జున తీవ్రంగా స్పందించారు. వాదనల సమయంలో హద్దులు దాటొద్దని, తన వైఖరి మార్చుకోవాలని హోస్ట్ హెచ్చరించారు. ఓటింగ్‌లో ముందున్నాడనే ప్రచారం ఉన్నప్పటికీ, అతడి ప్రవర్తనపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇకనైనా హౌస్ లో తన ప్రవర్తనను మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

మరో వైపు సీక్రెట్ రూమ్‌లో ఉంచి మళ్లీ హౌస్‌లోకి షాలినిని తీసుకురావడం, ఇప్పుడు ఎలిమినేట్ చేయడంపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక వచ్చే వారం 'అల్టిమేట్ గోట్' థీమ్‌తో ఆట మరింత రసవత్తరంగా మారనుంది. దక్షి, షాలిని నిష్క్రమణతో హౌస్‌లో సమీకరణాలు మారుతాయా? త్రిగుణ్ తన ఆటతీరును మార్చుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.