- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు 3 కార్పొరేషన్లకు ఎలక్షన్స్
- వచ్చే నెల 9న సర్ ప్రక్రియ ముగియగానే ఫైనల్ ఓటర్ల జాబితా
- అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్న రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు: చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. డిసెంబర్ చివరలో గానీ లేదా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలోగా గానీ స్థానిక పోరును పూర్తి చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. మొదటి వారంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఉన్నందున.. ఆ తరువాత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాలనాపరమైన వేగం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పాలనను పునరుద్ధరించాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ పూర్తైన వెంటనే ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్చేస్తున్నారు. ఈసారి స్థానిక ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని, రాజకీయ సమీకరణలు అనుకూలంగా ఉన్నప్పుడే పాగా వేయాలని అధికార పక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
స్పెషలాఫీసర్ పాలనకు స్వస్తి
జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లతో పాటు 5,773 ఎంపీటీసీ, 566 జడ్పీటీసీ స్థానాలకు స్వల్ప వ్యవధిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు త్వరలోనే స్వస్తి పలకనుంది. ఆర్థిక సంఘం నిధులు తెచ్చుకోవడంతో పాటు.. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి స్థానిక సంస్థల ప్రక్రియ పూర్తిగా క్లియర్ చేసుకోవాలని యోచిస్తున్నది. ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.
వచ్చే నెల 9వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. తుది ఓటరు జాబితా బయటకు రాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల కోసం వార్డులు, గ్రామాల వారీగా డేటాను విభజించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటుకు ఈ సవరించిన ఓటర్ల లిస్టే ప్రామాణికం కానుండటంతో ప్రభుత్వం ఈ ప్రక్రియపై ఆరా తీస్తోంది. నవంబర్ రెండో వారంలోగా జాబితా చేతికి రాగానే తదుపరి నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
సర్ ముగియగానే ఐఏఎస్ల బదిలీలు
ఓటర్ల జాబితా ప్రక్రియ ముగిసిన వెంటనే పరిపాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సీనియర్, జూనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని యోచిస్తోంది. ముఖ్యంగా వివిధ శాఖల హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, పనితీరు బాగా లేని ఇతర ఉన్నతాధికారుల స్థానాల్లో భారీ మార్పులు ఉంటాయని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుగ్గా ఉన్న అధికారులకే కీలక పోస్టింగులు ఇవ్వాలని సీఎం కసరత్తు చేస్తున్నారు. నవంబర్ 9 తరువాత ఐఏఎస్ బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పోలీస్ శాఖలో కూడా ఐపీఎస్, డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలపై హోంశాఖ ఇప్పటికే అంతర్గత నివేదికలను సిద్ధం చేసి ఉంచింది.
