తెలంగాణలో గంజాయి మాటున గన్ కల్చర్..రాజేంద్రనగర్ టు భద్రాచలం డ్రగ్స్ ముఠాల హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్

తెలంగాణలో గంజాయి మాటున గన్ కల్చర్..రాజేంద్రనగర్ టు భద్రాచలం డ్రగ్స్ ముఠాల హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్
  •     స్మగ్లర్ల చేతుల్లో రివాల్వర్లు.. రక్షణ లేని ఎక్సైజ్​ సిబ్బంది
  •       దావూద్​, రవి పూజారి గ్యాంగులతో లింకులు
  •     గంజాయి ముఠాలపై ‘ఈగల్​’ నజర్​
  •     వెపన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇప్పటికే ఎక్సైజ్​ శాఖ ప్రతిపాదనలు


 
హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముఠాలు రూటు మార్చాయి. కేవలం మత్తు పదార్థాల రవాణాకే పరిమితం కాకుండా.. ఏకంగా ప్రాణాంతక మారణాయుధాలను వెంటబెట్టుకొని తిరుగుతుండటం ఎక్సైజ్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నది. ఇటీవల రాజేంద్రనగర్, భద్రాచలం–పాల్వంచ పరిధిలో పట్టుబడిన భారీ ఎత్తున పిస్తోళ్లు, రివాల్వర్లు, బుల్లెట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తనిఖీలకు వెళ్లే ఎక్సైజ్ సిబ్బందికి కేవలం ఖాకీ డ్రెస్సు తప్ప చేతిలో కనీస ఆత్మరక్షణ ఆయుధాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రాణభయం వెంటాడుతున్నది. గంజాయి డాన్లు, అంతర్రాష్ట్ర స్మగ్లర్లు తమ అక్రమ దందాను కాపాడుకునేందుకు ఎదురుదాడికి కూడా వెనుకాడబోమనే సంకేతాలు ఇస్తుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. 

ప్రాణాలను పణంగాపెట్టి నిరాయుధులుగా దాడులకు వెళ్లాలంటే కిందిస్థాయి సిబ్బంది  జంకుతున్నారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డు మొదలుకొని మారుమూల సరిహద్దు జిల్లాల వరకు డ్రగ్స్ మాఫియా ‘గన్ కల్చర్’ను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ విభాగానికి కూడా ఆధునిక ఆయుధాలు సమకూర్చడం తక్షణావసరంగా మారిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

ఆయుధ నిల్వలు చూసి షాక్..

నగర శివార్లలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి అత్తాపూర్‌‌‌‌‌‌లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం సాగుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు మెరుపు దాడి చేశారు. ధూల్‌‌పేట్ ఎక్సైజ్ సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెంకన్నతోపాటు రాజేంద్రనగర్ ఎక్సైజ్ సీఐ నజీర్ భాషా బృందం శుక్రవారం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. సర్దార్ రాజాసింగ్ అనే నిందితుడి ఇంట్లో సోదాలు చేయగా.. 1.5 కిలోల గంజాయితో పాటు 1.13 కిలోల పాపీ స్ట్రా లభ్యమైంది. అయితే, డ్రగ్స్‌‌ను మించి అక్కడ బయటపడిన ఆయుధాల నిల్వలు అధికారులను షాక్‌‌కు గురిచేశాయి. ఇంట్లో దాచిపెట్టిన ఒక అధునాతన రివాల్వర్, నాలుగు పిస్తోళ్లు, ఐదు లైవ్ రివాల్వర్ బుల్లెట్లను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సాధారణ గంజాయి విక్రేత దగ్గర ఇంత పెద్ద మొత్తంలో నాటు తుపాకులు కాకుండా ఫ్యాక్టరీ మేడ్ పిస్తోళ్లు లభించడం గ్రేటర్ పరిధిలో  సంచలనం సృష్టించింది. అసలు ఈ ఆయుధాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరిని బెదిరించడానికి లేదా హత్యలకు ప్లాన్ చేశారనే కోణంలో ఎక్సైజ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

భద్రాచలంలో బయటపడ్డ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ లింక్‌‌లు

ఈ ఏడాది ఆగస్టు 20న భద్రాచలం–పాల్వంచ కేంద్రంగా వెలుగుచూసిన అంతర్రాష్ట్ర నెట్‌‌వర్క్ వెనుక ఏకంగా గ్యాంగ్‌‌స్టర్ రవిపూజారి ముఠా లింకులు బయటపడ్డాయి. ముంబై అండర్‌‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్‌‌నకు బద్ధశత్రువైన రవి పూజారి గ్యాంగ్‌‌కు చెందిన శ్యాంసుందర్ (సినీ నటిని బెదిరించిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి)కి జైల్లో గంజాయి స్మగ్లర్ విశ్వంబాల్‌‌తో పరిచయం ఏర్పడింది. విడుదలయ్యాక ఇద్దరూ కలిసి దుబాయ్ మీదుగా బిహార్‌‌కు చేరిన విదేశీ మారణాయుధాలను కార్లలో ఒడిశాకు తీసుకెళ్లారు. అక్కడ వ్యానులో 106 కిలోల గంజాయిని లోడ్ చేసి, దానికి పైలట్‌‌గా శ్యాంసుందర్, విశ్వంబాల్ కారులో బయలుదేరారు. ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ సీఐ రమేశ్‌‌ బృందం భద్రాచలం వద్ద తనిఖీల్లో కారును పట్టుకోగా.. తమ వెనకాలే వ్యాన్ వస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పాల్వంచ వద్ద కాపుకాసి ఆ వ్యానును సీజ్ చేశారు. అందులో రూ.56 లక్షల విలువైన 106 కిలోల గంజాయితో పాటు ఒక పిస్తోల్‌‌, ఐదు రివాల్వర్లు, 40 లైవ్ రౌండ్లు, 12 ఖాళీ మ్యాగజైన్లను దొరకగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు: మంత్రి జూపల్లి

డ్రగ్స్ మాఫియా నుంచి పొంచి ఉన్న ప్రాణాపాయాన్ని గుర్తించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు .. క్షేత్రస్థాయి అధికారులకు ఆయుధాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్  సిబ్బందికి తుపాకులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపారు.

 సరిహద్దుల్లో భారీ ఎత్తున దాడులు నిర్వహించే ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ బృందాలకు కనీసం పిస్తోళ్లు, అత్యాధునిక వెపన్స్ ఇవ్వాలని విభాగం భావిస్తున్నది. ఇలాంటి హైప్రొఫైల్ అంతర్రాష్ట్ర ఆయుధాల స్మగ్లింగ్ దందాను కేవలం ఎక్సైజ్ శాఖ ఒక్కటే ఎదుర్కోవడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ వింగ్, ఈగల్ టీమ్స్ ఎక్సైజ్ విభాగం పరస్పర సమన్వయంతో ఉమ్మడి టాస్క్‌‌ఫోర్స్‌‌గా ఏర్పడితేనే డ్రగ్-వెపన్ సిండికేట్‌‌ను సమూలంగా అంతం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు.