గురుకులాల్లో టెంపరరీ టీచర్లను పర్మినెంట్ చేయాలె : ఆర్ కృష్ణయ్య 

గురుకులాల్లో టెంపరరీ టీచర్లను పర్మినెంట్ చేయాలె : ఆర్ కృష్ణయ్య 
  • గెస్ట్ టీచర్స్, గెస్ట్ లెక్చరర్స్  సమావేశంలో ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రం లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 8 వేల మంది టెంపరరీ, గెస్ట్, పార్ట్​టైం టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్‌‌‌‌‌‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్  నీల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాత్కాలిక ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 నుంచి 20 ఏండ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వారి అర్హతలు, అనుభవం ఆధారంగా పర్మినెంట్ చేయాలని కోరారు.

గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల బోధనతో పదో తరగతిలో 99 శాతం, ఇంటర్మీడియట్‌‌‌‌లో 98.5 శాతం ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ పంజాబ్ తదితర రాష్ట్రాల తరహాలో తెలంగాణలోను పర్మినెంట్ చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. కాంట్రాక్ట్, డైలీ వైజ్, ఔట్​సోర్సింగ్,  గెస్ట్ టీచర్స్, గెస్ట్ లెక్చరర్స్ కు న్యాయం చేయవలసిన అవసరం ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలన్నారు. లేకపోతే ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.