సీపీఎస్ రద్దుపై అధ్యయనకమిటీని వేయాలి : జి. సదానందం గౌడ్

సీపీఎస్ రద్దుపై అధ్యయనకమిటీని వేయాలి : జి. సదానందం గౌడ్
  • పీఆర్సీపై ఆలస్యం వద్దు.. సర్వీస్ రూల్స్ పంచాయితీ తేల్చాలి
  • ఎస్టీయూ  రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్​ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ ) రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌‌‌‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు వెంటనే అధ్యయన కమిటీని నియమించాలని కోరారు.

ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని సంఘ భవనంలో నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.  గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. విద్యాశాఖలో జీవో 190ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నూతన హెల్త్ స్కీమ్‌‌‌‌ను పారదర్శకంగా అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు వెంటనే సరిదిద్దాలని కోరారు. డీఎస్సీ–2003 బ్యాచ్ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలన్నారు.

ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు 010 హెడ్ ట్రెజరీ ద్వారానే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, సంఘం మాజీ అధ్యక్షుడు ఎం. పర్వత్ రెడ్డి, నేతలు సాబేర్ ఆలీ, ఎల్ఎం ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, పోల్ రెడ్డి, ఏవీ సుధాకర్, శంకర్ మాతంగి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.