మగ్గం మీద మాయాజాలం... తరతరాల కళకు నీరాజనం.. నారాయణపేట చేనేత ప్రత్యేకత ఇదే..!

మగ్గం మీద మాయాజాలం... తరతరాల కళకు నీరాజనం.. నారాయణపేట చేనేత ప్రత్యేకత ఇదే..!

నూలుపోగు... నూలుపోగు కలిస్తే అందమైన చీర రూపుదిద్దుకుంటుంది! రంగురంగుల దారాలకు సంప్రదాయ డిజైన్లు తోడైతే నారాయణపేట చేనేత ప్రత్యేకత కళ్లముందు ఆవిష్కృతమవుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. తరతరాలుగా చేతుల మీదుగా వారసత్వంగా వస్తున్న కళ ఇది. యంత్రాల వేగం పెరిగినా.. మగ్గం మీద నేసే చీరకు ఉండే అందం, ఆత్మీయత ప్రత్యేకమే. మగ్గం మీద కదిలే ప్రతి దారం వెనుక ఒక కుటుంబం శ్రమ ఉంది. ప్రతి చీర వెనుక తరతరాల నైపుణ్యం ఉంది.

తెలంగాణ చేనేతకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రాంతాల్లో నారాయణపేట ఒకటి. సంప్రదాయ రంగుల కలయిక.. ఆకట్టుకునే అంచులు.. చక్కటి డిజైన్లు.. వీటితో నారాయణపేట చీరలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మగ్గం మీద దారాలను అమర్చి, ప్రతి పోగును జాగ్రత్తగా అల్లుతూ నేతన్నలు చీరలకు రూపమిస్తారు. ఒక్క చీర వెనుక ఎన్నో గంటల శ్రమ ఉంటుంది. 

నూలు ఎంపిక నుంచి రంగులు, డిజైన్లు, నేత వరకు ప్రతి దశలో నైపుణ్యం అవసరం. కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేసే చోట ఈ కళ ఒక వృత్తి మాత్రమే కాదు.. కుటుంబ వారసత్వం కూడా! నారాయణపేట, పేరపాళ్ల, కోటకొండ, జాజాపూర్ గ్రామాలకు చెందిన 1536 మంది చేనేత కార్మికులు తమ ఇళ్లలో చేనేత మగ్గాలపై చీరలు నేస్తున్నారు. ఈ గ్రామాల్లో మాస్టర్ వీవర్స్ 14 మంది, 129 మంది 
శారీ వీవర్స్ ఉన్నారు.

పెరిగిన నూలు ధరలు

తెలంగాణలో కాలంతో పాటు చేనేత రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. నూలు ధరలు పెరిగాయని, దీంతో తాము మగ్గాలపై రోజంతా పనిచేసినా కనీస కూలీ కూడా దక్కడం లేదని మరో చేనేత కార్మికుడు మేకల మురళీ మోహన్ ఆవేదనగా చెప్పారు.

 పెరిగిన ముడిసరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాలు, పవర్‌‌‌‌లూమ్‌‌‌‌ల మధ్య పోటీ, మధ్యవర్తుల ప్రభావం నేతన్నల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కో చేనేత కార్మికుడు రోజంతా కష్టపడి చీర నేసినా, దానికి తగిన ధర లభిస్తోందా? తమ శ్రమకు తగిన ప్రతిఫలం అందుతోందా? అంటే అందటం లేదని నారాయణ పేట్ చేనేత కార్మికులు చెప్తున్నారు.

మారుతున్న డిజైన్లు..

సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే కొత్త మార్కెట్లను అందిపుచ్చుకుంటే ఈ కళకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. గంగా జమున బార్డర్, ప్రీమియం సాఫ్ట్ శారీస్, ఎవర్ గ్రీన్ శారీస్, స్ట్రైప్స్ అండ్ చెక్స్, వీవర్స్ స్పెషల్, జరీ బార్డర్, డ్రెస్ మెటీరియల్, కాటన్ క్లాసిక్, ప్యూర్ ముల్ కాటన్, కలంకారీ, ప్రింటెడ్ శారీస్​కు మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

మరాఠా రాజుల ఆదరణ పొందిన చీరలు

నారాయణపేట చీరలను ఒకప్పుడు దేవతల వస్త్రాలు అని పిలిచేవారు. సంప్రదాయ పద్ధతిలో చేతితో నేసే ఈ చీరలపై మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రభావం కనిపిస్తుంది. ఒకప్పుడు మరాఠా రాజుల ఆదరణ పొందిన ఈ నారాయణపేట చీరలు నేటి ఆధునిక భారతీయ మహిళలకు కూడా ఎంతో ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తున్నాయి. 

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని రోజులపాటు నారాయణపేటలో బస చేశారు. ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించినప్పటికీ, ఆయన వెంట వచ్చిన కొంతమంది నేత కార్మికులు ఇక్కడే ఉండిపోయారు. వారు ఒక ప్రత్యేకమైన శైలిలో చీరలను నేయడం ప్రారంభించారు. కాలక్రమేణా ఇవి ప్రాచుర్యం పొంది నారాయణపేట చీరలుగా పేరుపొందాయి.

నారాయణపేట చీరలకు జీఐ ట్యాగ్​

రాయణపేట చీరలకు 2013వ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేటర్ గుర్తింపు లభించింది.నారాయణపేట సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో చేనేత కార్మికులు చేసిన విలువైన కృషిని జీఐ ట్యాగ్ గుర్తిస్తుంది. నారాయణపేట పేరును వాడుకుంటూ వాణిజ్య పవర్ లూమ్‌‌‌‌లు తయారుచేసే చవకబారు వస్త్రాలతో పోల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న నేత కార్మికులకు ఇది ఒక తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చింది.

 తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా నుంచి వచ్చిన ప్రసిద్ధ సంప్రదాయ చేనేత వస్త్రాలు ఒకే మగ్గంపై ఒకేసారి ఎనిమిది చీరలను నేయడం ఈ చీరల ప్రత్యేకత. వీటిలో కాంట్రాస్ట్ రంగుల అంచులు, సంప్రదాయ రుద్రక్షం, టెంపుల్ బోర్డర్లు, సాధారణ లైన్ లేదా జరీ పల్లు ఉంటాయి. 

ఈ చీరలు ప్రధానంగా కాటన్, సిల్క్ వెర్షన్లలో లభిస్తున్నాయి. మృదువైన మర్కెరైజ్డ్ కాటన్​ వల్ల ఇవి రోజువారీ ధరించడానికి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. మణాలీ కలెక్షన్స్ ,  సుకన్య శారీస్, భవానీ హాండ్లూమ్స్, నారాయణపేట హ్యాండ్లూమ్స్ శారీస్, యశోదా హ్యాండ్లూమ్స్ శారీస్, గణేశ్ హ్యాండ్లూమ్స్, వర్ష హ్యాండ్లూమ్స్  వంటివి నారాయణపేట చీరల విక్రయానికి ప్రసిద్ధి చెందాయి.

అరణ్యపర్వం చీరలు

నారాయణపేట అరణ్యపర్వం చీరలు తెలంగాణలోని ప్రసిద్ధ నారాయణపేట చేనేత శైలిలో రూపొందించిన ప్రత్యేకమైన సంప్రదాయక కాటన్ చీరల కలెక్షన్. ప్రకృతి సిద్ధమైన రంగులు, అడవి వన్యప్రాణుల ఇతివృత్తాలతో కూడిన డిజైన్ల వల్ల వీటికి ఈ పేరు వచ్చింది. ఈ అరణ్యపర్వం సిరీస్ చీరలలో పెద్ద లేదా మధ్యస్థ పరిమాణంలో ఉండే జరీ బోర్డర్‌‌‌‌పై అందమైన ఏనుగుల మోటిఫ్స్ లేదా సంప్రదాయ దేవాలయ డిజైన్లను నేస్తారు. 

అరణ్యానికి ప్రతీకగా ఉండే బాటిల్ గ్రీన్, మెరూన్, పర్పుల్, హెన్నా గ్రీన్, మెజెంటా వంటి గాఢమైన ఆకర్షణీయమైన రంగుల్లో ఈ చీరలు లభిస్తున్నాయి. చీర మధ్యభాగం సాధారణంగా నారాయణపేట సిగ్నేచర్ స్టైల్ అయిన చిన్న చెక్స్ లేదా ప్లెయిన్ డిజైన్‌‌‌‌తో ఉండి, పల్లు భాగంలో సాంప్రదాయ గీతలు, కుచ్చులు ఉంటాయి. 

అరణ్యపర్వం బిగ్ బోర్డర్ నారాయణపేట కాటన్ చీరల ధర రూ.1,200 నుంచి రూ.1,600 మధ్యలో మార్కెట్ లేదా ఆన్‌‌‌‌లైన్ బోటిక్స్‌‌‌‌లలో లభిస్తున్నాయి.

హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లలో డిమాండ్​

హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లలో నారాయణపేట చేనేత కళాకారుల స్టాళ్లకు డిమాండ్ ఉంది. హైటెక్స్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్, నారాయణపేట ఎక్స్ పో, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోని హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్, నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలోని హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్​లో నారాయణపేట చీరలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నారు. వీటికి కొనుగోలుదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఏదేమయినా నేతన్నకు గిట్టుబాటు ధర... చేనేతకు కొత్త మార్కెట్... ఈ రెండూ తోడైతేనే నారాయణపేట కళకు నిజమైన భవిష్యత్తు!

 ఆన్​లైన్​లో చీరల విక్రయాలు

పురాతన చేనేత వస్త్రాలకు పేరొందిన నారాయణపేటలో మగ్గాలపై ఫ్యూర్ కాటన్, నారాయణపేట నిప్పాణి, రుద్రాక్ష డిజైన్లలో చీరలు నేస్తున్నానని నారాయణపేటకు చెందిన మాస్టర్ వీవర్ కాస్సా రాఘవేంద్ర చెప్పారు. తాను మగ్గంపై నేసిన చీరలను ఆన్ లైన్​లో పెట్టి విక్రయిస్తున్నానని ఆయన తెలిపారు. 

తన తాత, ముత్తాతల నుంచి వస్తున్న చేనేత రంగాన్ని తాను చేపట్టి మరో పదిమంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నానని నారాయణపేటకు చెందిన చేనేత కార్మికుడు పూడూరు శ్రీనివాస్  చెప్పారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న చేనేత రంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో తాను డ్రెస్ మెటీరియల్, చున్నీలు, రంగురంగుల చేనేత చీరలు, లుంగీలు నేస్తున్నానని ఆయన చెప్పారు. తన నేత కళా కౌశల్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తనకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డునిచ్చి సత్కరించిందన్నారు.
 
గమనిక:  మీరూ లైఫ్ & లిటరేచర్​ వ్యాసాలు  పంపాలి అనుకుంటున్నారా? అయితే.. ఈ వ్యాసాన్ని హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.