AIతో ఇక నావల్ల కాదు.. వెళ్లి పొలం పనులు చేసుకుంటా: సీనియర్ టెక్కీ చెప్పిన నిజాలు

AIతో ఇక నావల్ల కాదు.. వెళ్లి పొలం పనులు చేసుకుంటా: సీనియర్ టెక్కీ చెప్పిన నిజాలు

టెక్ ప్రపంచంలో AI సృష్టిస్తున్న సునామీకి ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అలిసిపోయాడు. దశాబ్ద కాలంగా కోడింగ్ రంగంలో అనుభవం ఉన్న ఆ టెక్కీ.. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును చూసి భయపడిపోయాడు. భవిష్యత్తులో సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉంటాయా లేదా అనే సందేహంతో.. వ్యవసాయం వైపు వెళ్లి సొంతంగా ఆహారాన్ని పండించుకోవాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించడం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది.

రెడ్డెట్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ “నేను అలిసిపోయాను, బాస్” అనే హెడ్డింగ్‌తో ఆయన పెట్టిన ఒక వైరల్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మనం ఒక పిచ్చి కాలంలో జీవిస్తున్నామని, ఈ మార్పులను ఎవరూ అందుకోలేకపోతున్నారని వాపోయారు. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో సాంప్రదాయ ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని.. తన కెరీర్‌పై అనిశ్చితి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఏఐ టూల్స్ వేగంగా పుట్టుకురావటమే. గతంలో ఏఐ కేవలం కోడ్ మాత్రమే రాయగలదని, ఆర్కిటెక్చర్ డిజైనింగ్, సిస్టమ్స్ రూపకల్పన వంటి క్లిష్టమైన పనులకు సీనియర్ ఇంజనీర్లు ఖచ్చితంగా అవసరమని సదరు టెక్కీ గట్టిగా నమ్మాడు. కానీ కేవలం ఒక్క సంవత్సరంలోనే ఆ నమ్మకం తలకిందులైంది. "ఇప్పుడు ఏఐ సిస్టమ్స్‌ను డిజైన్ చేయగలదు. అంతేకాదు చాలా సందర్భాల్లో మనకంటే అదే అద్భుతంగా పని చేస్తోంది" అని వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తూ టెక్ ఉద్యోగిగా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.

ALSO READ : మార్కెట్లకు చమురు సెగ! .. 117 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెబ్‌సైట్లు బిల్డ్ చేయడం, గేమ్స్ డెవలప్ చేయడం, సాస్ ఉత్పత్తులను లాంచ్ చేయడం వంటి పనులన్నీ ఒకప్పుడు మనుషుల మేధస్సుకు నిదర్శనంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవే పనులను ఏఐ ఇట్టే చేసేస్తుంటే.. ఈ రకమైన పనులకు అర్థం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. "మనం భవిష్యత్తులో మన కొంప ముంచే సాధనాన్నే మన చేతులతో స్వయంగా తయారు చేస్తున్నామేమో" అంటూ ఆందోళన చెందారు. నిరంతరం మారుతున్న టెక్నాలజీ వేగాన్ని అందుకోలేక తాను మానసికంగా పూర్తిగా అలిసిపోయానని, ఈ రొంపి నుంచి బయటపడి వ్యవసాయమే నయమని తేల్చిచెప్పారు. రానున్న 10 ఏళ్లలో ఏఐ మనుషులకు పనులు లేకుండా చేస్తుందనే వాదనకు టెక్కీ చెప్పిన వాస్తవాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.