జడ్జి కుమారుడి బెంజ్ కారు ఢీకొని చిరు వ్యాపారి మృతి!.. గంటల్లోనే నిందితుడి విడుదలతో వివాదం!

జడ్జి కుమారుడి బెంజ్ కారు ఢీకొని చిరు వ్యాపారి మృతి!.. గంటల్లోనే నిందితుడి విడుదలతో వివాదం!

అతను మైనర్.. పైగా ర్యాష్ డ్రైవింగ్.. సీన్ కట్ చేస్తే ఓ నిండు ప్రాణం బలైంది. అతను మైనరే కాదు.. ఓ బాధ్యత యుతమైన పదవిలో ఉన్న జడ్జి కొడుకు కూడా.. కేరళలోని కొచ్చిలో జరిగిన మెర్సిడెజ్ బెంజ్ కారు ప్రమాదంలో ఓ చిరు వ్యాపారి చనిపోయాడు. కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన్ని గంటల్లో నిందితుడిని విడుదల చేయడం చర్చనీయాంశమైంది. నిందితుడు జడ్జి కొడుకు కావడంవల్లే కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 

ఆదివారం తెల్లవారు జామున కొచ్చిలో ఈ ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన ఓ జడ్జి 17ఏళ్ల కుమారుడు  మెర్సిడెస్ బెంజ్ కారును వేగంగా  నడుపుతూ స్కూటరిస్టును ఢీకొట్టాడు. బాధితుడు స్పాట్ లోనే చనిపోయాడు. మైనర్ అయిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని గంటల్లో స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.  విచారణలో భాగంగా అతడిని మళ్లీ పిలిపిస్తామని పోలీసులు తెలిపారు.

మైనర్ తండ్రి త్రిస్సూర్‌లోని ఒక స్థానిక కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆ వాహనానికి ఆయనే రిజిస్టర్డ్ యజమాని. ఈ ప్రమాదానికి సంబంధించి ఆయన బాధ్యతను, అలాగే ఆయనను నిందితుడిగా చేర్చే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ALSO READ : మన్ కీ బాత్  నాకు పవిత్ర యాత్ర..

పోలీసుల వివరాల ప్రకారం.. మైనర్ పేరెంట్స్ తెలియకుండా కారును నడిపేందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం పడుతుండగా.. మంజలి ప్రాంతానికి చెందిన బాదితుడు జయబాలకృష్ణన్.. రోడ్డు పక్కన బడ్డీ కొట్టును మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా మెర్సిడెస్ కారు వెనకనుంచి ఢీకొట్టింది.స్కూటరిస్టు అకస్మాత్తుగా కారు అడ్డంగా వచ్చారని నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు. 

ఈ కేసులో బాధిత కుటుంబం వాదన మరోలా ఉంది. నిందితుడు జడ్జి కొడుకు కావడం వల్లే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని.. పోలీస్ స్టేషన్ లో స్వయంగా జడ్జి తమపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ కేసుల మోటార్ వెహికల్ చట్టం  కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.