రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్‌లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్‌లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ  వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని చారిత్రక రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా మరో ముందడుగు పడింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. బేగంపేట నుంచి ప్రారంభమైన ఈ ట్రెక్కింగ్‌లో ఆయన ఖిల్లా అందాలను వీక్షిస్తూ, దాని చారిత్రక విశిష్టతను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

రామగిరి ఖిల్లాకు పర్యాటక ప్రాధాన్యతను పెంచడంతో పాటు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, ముఖ్యంగా రోప్‌వే ఏర్పాటు చేయాలని ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ఎంపీ వంశీకృష్ణ చేసిన కృషి నేపథ్యంలో ఇటీవల రామగిరి ఖిల్లాకు రోప్‌వే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆయన ఖిల్లాను సందర్శించారు. రోప్‌వే ఏర్పాటు ద్వారా ఈ చారిత్రక ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని, స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

రోప్‌వేకు నిధుల మంజూరు కావడంపై మంథని ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. రామగిరి ఖిల్లా అభివృద్ధి చెందితే ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యత మరింత వెలుగులోకి రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్రెక్కింగ్‌లో అటవీ శాఖ అధికారులు, పోలీసులు, ఎంపీ వంశీకృష్ణ అనుచరులు పాల్గొన్నారు.