ఎలాన్ మస్క్ మాస్టర్ ప్లాన్ సక్సెస్: మెుదటి ఏడాదే టెస్లాకు లాభాలు.. ఎన్ని కోట్లంటే?

ఎలాన్ మస్క్ మాస్టర్ ప్లాన్ సక్సెస్: మెుదటి ఏడాదే టెస్లాకు లాభాలు.. ఎన్ని కోట్లంటే?

టెస్లా మోటార్స్ ఇండియాలో బిజినెస్ స్టార్ చేసిన తొలి సంవత్సరమే లాభాల బాట పట్టింది. భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన FY26లో ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ' అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. దేశంలో మోడల్ వై కార్ల విక్రయాలను ప్రారంభించిన ఏడాదే రూ. 247 కోట్ల రెవెన్యూను, రూ. 5కోట్ల 16లక్షల నికర లాభాన్ని ఆర్జించి సంచలనం సృష్టించింది. 

గత ఆర్థిక సంవత్సరంతో (FY25) పోలిస్తే టెస్లా ఇండియా వృద్ధిరేటు అసాధారణంగా ఉంది. అంతకుముందు ఏడాది కేవలం సర్వీసుల ద్వారా మాత్రమే రూ.20కోట్ల 83లక్షల రెవెన్యూ రాగా.. కేవలం రూ.55లక్షల 49వేల నికర లాభం రికార్డ్ చేసింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ రెవెన్యూ దాదాపు 12 రెట్లు పెరిగింది. ముఖ్యంగా ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత దేశంలో టెస్లా అమ్మకాలు ఊపందుకున్నాయి. మొత్తం రెవెన్యూలో కార్ల సేల్స్ వాటానే దాదాపు 87 శాతంగా ఉంది. వెహికల్ సేల్స్ ద్వారా రూ. 214 కోట్లు రాగా, సర్వీసుల ద్వారా రూ.32 కోట్లు సమకూరాయి.

 ప్రారంభంలో టెస్లా ఈవీ కార్ల అమ్మకాలు కొద్దిగా నెమ్మదిగా సాగినప్పటికీ.. క్రమంగా పుంజుకుంటున్నాయి. వాహన్ డేటా ప్రకారం సెప్టెంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో భారతదేశంలో 346 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య 650కి చేరుకోవడం విశేషం. సగటు నెలవారీ రిజిస్ట్రేషన్లు 49 నుంచి 108కి పెరగటం కంపెనీకి ఊపు నిచ్చింది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో మోడల్ వై, వైఎల్ కార్లను టెస్లా విక్రయిస్తోంది. వీటి ధరలు సుమారు రూ.50 లక్షల నుంచి రూ. 62 లక్షల వరకు ఉన్నాయి.

వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. FY26లో టెస్లా ఇంటర్నేషనల్ బీవీ ద్వారా రూ.86 కోట్లను భారతీయ కంపెనీలోకి చొప్పించారు. ప్లాంట్లు, ఆస్తులపై క్యాపిటల్ వ్యయం రూ.62.54 కోట్లకు చేరింది. ఉద్యోగుల జీతభత్యాలు రూ.43.67 కోట్లకు, రెంట్ ఖర్చులు రూ.30.32 కోట్లకు పెరిగాయి. మొత్తం ఖర్చులు రూ.240 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ టెస్లా తన దూకుడును మరింత పెంచుతోంది.