కొరియా పెట్టుబడులకు  తెలంగాణ కేరాఫ్!.. టూరిజంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు 

కొరియా పెట్టుబడులకు  తెలంగాణ కేరాఫ్!.. టూరిజంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు 
  • కొరియా వాళ్లకు హైదరాబాద్ రెండో ఇల్లు: డిప్యూటీ సీఎం భట్టి
  •  టూరిజంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు.. 
  • 3 లక్షల కొలువులే లక్ష్యం
  • సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌‌‌‌, లైఫ్‌‌‌‌సైన్సెస్‌‌‌‌ రంగాల్లో భాగస్వామ్యం
  • తెలంగాణ–కొరియా మైత్రికి ‘బుద్ధవనం’ ఆధ్యాత్మిక వారధి
  • ఘనంగా ‘కె-హార్మనీ ఫెస్టా’ 

హైదరాబాద్, వెలుగు: ద‎క్షిణ కొరియా సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వాహనాలు, ఆధునిక తయారీ, లైఫ్‌‌‌‌‌‌‌‌ సైన్సెస్‌‌‌‌‌‌‌‌, పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో కొరియా సంస్థలతో కలసి పనిచేసేందుకు తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 

ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘కె -హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్ డే 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2024 ఆగస్టులో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కొరియా పర్యటన సందర్భంగా జరిగిన పెట్టుబడుల చర్చలు ఇరు ప్రాంతాల మధ్య దృఢమైన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేశాయని గుర్తుచేశారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 

కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని, విద్య, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికతపై నిరంతరం పెట్టే పెట్టుబడులే నిజమైన అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. పరిశ్రమలతో పాటు వర్సిటీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, చిన్న తరహా పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. పర్యాటక రంగంలోనూ కొరియా పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు.

 ‘తెలంగాణ పర్యాటక విధానం 2025–30’ ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, కొత్తగా 3 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 27 పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందించామని భట్టి తెలిపారు. పర్యాటక మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగం, చలనచిత్ర పర్యాటకం, వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ టూరిజం, సాంస్కృతిక అనుభవాల అభివృద్ధిలో కొరియా సంస్థల భాగస్వామ్యాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు.

భారత్‌‌‌‌‌‌‌‌–కొరియా మధ్య సాంస్కృతిక బంధం

‎కొరియా సంస్కృతి, కళలు, సంగీతం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుక రెండు దేశాల ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ‎యుద్ధం, పేదరికం వంటి సవాళ్లను అధిగమించి కొరియా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, తయారీ, విద్య, ఆవిష్కరణల్లో ఆ దేశం సాధించిన విజయాలు ప్రశంసనీయమన్నారు. కొరియన్‌‌‌‌‌‌‌‌ సంగీతం, సినిమాలు, టెలివిజన్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్నాయని, సాంస్కృతిక ప్రభావం ఒక దేశ అంతర్జాతీయ గుర్తింపును పెంపొందిస్తుందని పేర్కొన్నారు.  

‎తెలంగాణ వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు

‎విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలయికకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శతాబ్దాలుగా కేంద్రంగా నిలిచిందని వివరించారు. బతుకమ్మ, బోనాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలు తెలంగాణ ప్రత్యేకతలని వెల్లడించారు. చార్మినార్‌‌‌‌‌‌‌‌, గోల్కొండ కోట, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం సహా రాష్ట్రంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయని తెలిపారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఉన్న బుద్ధవనం వంటి బౌద్ధ వారసత్వ ప్రదేశాలు భారత్‌‌‌‌‌‌‌‌, తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలవన్నారు. 

కొరియా పర్యాటకులు తెలంగాణను సందర్శించాలని, ఇరు ప్రాంతాల యువత చదువు, పరిశోధన, ఉద్యోగాలు, సృజనాత్మక రంగాల్లో పరస్పరం అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి లీ సియుంగ్–హో.. డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం పలికారు.