6 నెలల్లో 36 మరణశిక్షలు విధించిన జడ్జి రవికుమార్ బదిలీ

6 నెలల్లో 36 మరణశిక్షలు విధించిన జడ్జి రవికుమార్ బదిలీ
  • ఫాస్ట్ ట్రాక్ నుంచి ఫ్యామిలీ కోర్టుకు ట్రాన్స్​ఫర్

ముజఫర్‌‌నగర్‌‌: వరుసగా మరణశిక్షలు విధించి సంచలనం సృష్టించిన జడ్జి రవి కుమార్ దివాకర్‌‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు తాజాగా న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ముజఫర్‌‌నగర్‌‌లోని ఫ్యామిలీ కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి సెప్టెంబర్‌‌ మధ్య ముజఫర్‌‌నగర్‌‌లో 11 కేసుల్లో 23 మందికి మరణశిక్షలు విధించి దివాకర్‌‌ వార్తల్లో నిలిచారు. అంతకుముందు బరేలీలోనూ 13 మందికి మరణశిక్షలు విధించారు. మొత్తంగా 16 నెలల్లో 36 మరణశిక్షలు విధించిన జడ్జిగా ఆయన గుర్తింపు పొందారు. ముజఫర్‌‌నగర్‌‌, షామ్లీ జిల్లాలకు సంబంధించిన క్రిమినల్‌‌ కేసులను ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్టు-3 ప్రిసైడింగ్ అధికారిగా విచారించారు.

కోర్టు నుంచి 97 కేసుల ఫైళ్ల ఉపసంహరణ

దివాకర్‌‌ ముజఫర్‌‌నగర్‌‌లో పనిచేసిన సమయంలో ఆయన కోర్టులో పెండింగ్‌‌లో ఉన్న 97 కేసుల ఫైళ్లను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అప్పటి జిల్లా, సెషన్స్‌‌ జడ్జి బీరేంద్ర కుమార్‌‌ సింగ్‌‌ ఆదేశాల మేరకు ఆగస్టులో ఈ ఫైళ్లను ఉపసంహరించారు. ఈ విషయంపై కూడా దివాకర్‌‌ ప్రశ్నలు లేవనెత్తారు.  జ్ఞానవాపి మసీదు సర్వే ఆదేశాలతోనూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవల తనకు కేటాయించిన గన్‌‌ మెన్​ను తొలగించడంపై యూపీ డీజీపీకి లేఖ సైతం రాశారు. తాజాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు-2 ప్రిసైడింగ్ అధికారి, అదనపు సెషన్స్‌‌ జడ్జి శివ్‌‌ కుమారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు-3కు బదిలీ చేశారు.