స్విస్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు 

స్విస్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు 
  • బెర్న్ బతుకమ్మ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: స్విస్ కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే భాగస్వామ్యాలను అభివృద్ధి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌‌‌‌లోని బెర్న్ నగరంలో స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పర్యాటకం, ఫిల్మ్ టూరిజం, ఆతిథ్య రంగాల్లో తెలంగాణ–స్విట్జర్లాండ్ మధ్య పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

లైఫ్ సైన్సెస్, ఏఐ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో స్విట్జర్లాండ్‌‌‌‌తో కలిసి పనిచేసేందుకు మంచి వాతావరణం ఉందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలంగాణ సంస్కృతికి నిజమైన రాయబారులని మంత్రి అభివర్ణించారు. మన భాష, పండుగలను కొనసాగిస్తూనే.. రాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.