సిద్దిపేట రూరల్, వెలుగు: కుల, మత, పార్టీలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని సిద్దిపేటలో కొనసాగించడం అభినందనీయమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, మన పండుగలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు.
అమెరికాలోనూ అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోందని, దేవాలయాలు నిర్మిస్తున్నారని తెలిపారు. బతుకమ్మ, దసరా, వినాయక చవితి వంటి పండుగలు విదేశాల్లోనూ జరుపుకోవడం గర్వకారణమన్నారు. అందరినీ ఐక్యంగా ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో దూది శ్రీకాంత్ రెడ్డి ఏనిమిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, అంబటి బాలేశ్గౌడ్, కలాల్ శ్రీనివాస్, సీపీఐ నాయకుడు మంద పవన్, కాంగ్రెస్ నాయకుడు బొమ్మల యాదగిరి, బీఆర్ఎస్ నాయకుడు జైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బాసంగారి వెంకట్, కొత్తపల్లి రాధ వేణుగోపాల్ పాల్గొన్నారు.
