మంచిర్యాల జిల్లా, వెలుగు: కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉదయం వాకింగ్ చేసిన ఆయన.. అక్కడి వాకర్స్, స్థానిక యువతతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా క్రీడా మైదానంలో ఉన్న సమస్యలు, అభివృద్ధి పనులపై స్థానికులు మంత్రికి వివరించారు. మైదాన అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి సుద్దాల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను స్వయంగా పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్ని విధాలా సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
