మన్ కీ బాత్  నాకు పవిత్ర యాత్ర..12 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమం: ప్రధాని మోదీ

మన్ కీ బాత్  నాకు పవిత్ర యాత్ర..12 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమం: ప్రధాని మోదీ
  • విజయ దశమి నాడు మొదలైన కార్యక్రమం 
  • 12 వసంతాలు పూర్తి చేసుకున్నది: ప్రధాని మోదీ
  • శ్రోతలే నాకు సహ ప్రయాణికులు
  • స్ఫూర్తిమంతంగా పంజాబ్‌‌‌‌‌‌‌‌ ‘ఖేతీ విరాసత్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌’ 
  • మన స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది
  • ‘వోకల్ ఫర్ లోకల్’ను విజయవంతం చేయండి
  • పండుగల వేళ స్వచ్ఛత పాటించాలని ప్రజలకు మోదీ పిలుపు

న్యూఢిల్లీ:మన్‌‌‌‌‌‌‌‌ కీ బాత్‌‌‌‌‌‌‌‌ తనకు ఓ పవిత్ర యాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘ఇది నాకు సాధారణ కార్యక్రమం కాదు.. అదొక ఆధ్యాత్మిక తీర్థయాత్ర. సమాజం కోసం, దేశ పురోగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి సామాన్య పౌరుడూ ఒక తీర్థ క్షేత్రంతో సమానం. అలాంటి కోట్లాది భారతీయుల నిస్వార్థ కృషిని దగ్గరగా చూస్తూ, వారి సమిష్టి శక్తికి వందనం సమర్పించేందుకు ఈ వేదిక నాకు లభించిన గొప్ప అవకాశం” అని వ్యాఖ్యానించారు.  విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ‘మన్ కీ బాత్’ ప్రయాణం నిరాటంకంగా సాగుతూ ఆదివారంతో విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నదని చెప్పారు. 139వ మన్‌‌‌‌‌‌‌‌కీబాత్‌‌‌‌‌‌‌‌ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌లో మోదీ  ప్రసంగించారు. శ్రోతలే తనకు తోడుగా నిలిచిన సహ ప్రయాణికులు, మార్గదర్శకులని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి కుటుంబంతో అనుబంధం పెనవేసుకునేందుకు ఈ వేదిక ఒక అమూల్యమైన నిధిలా మారిందని హర్షం వ్యక్తం చేశారు.

పల్లెసీమల్లో సేంద్రియ విప్లవం 

దేశంలోని గ్రామీణ నైపుణ్యాలు, సామాన్యుల విజయగాథలను మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. పంజాబ్‌‌‌‌‌‌‌‌లోని ‘ఖేతీ విరాసత్ మిషన్’ ఆధ్వర్యంలో ‘నవ్-త్రింజన్’ పేరుతో సహజసిద్ధ రంగుల పత్తిని సాగు చేస్తూ రసాయన రంగుల అవసరం లేకుండా సేంద్రియ విప్లవానికి తెరతీశారని ప్రశంసించారు. గతంలో కూలీలుగా పనిచేసిన రమణ్‌‌‌‌‌‌‌‌దీప్ కౌర్, సునేహా దేవి, రజినీ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి మహిళలు నేడు నైపుణ్యం కలిగిన నేత కార్మికులుగా మారి తమ కుటుంబాలకు ఆర్థిక ఆలంబనగా నిలిచారని తెలిపారు. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ సంప్రదాయ చిరుధాన్యాల సాగు ఊపందుకుంటోందని, మేఘాలయలోని ఖండూలి గ్రామంలో మహిళలు మిల్లెట్లతో కేకులు, కుకీలు, బేబీ ఫుడ్ తయారు చేస్తూ మార్కెట్ డిమాండ్ పెంచారని తెలిపారు

హేవల్ నదికి పూర్వ వైభవం 

పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని తెహ్రీ గఢ్వాల్ ఉదంతాన్ని మోదీ వివరించారు. ప్రజలు, స్థానిక యంత్రాంగం ఏకమై చేపట్టిన ఉద్యమం వల్ల ‘హేవల్’ నది పూర్వ వైభవాన్ని సంతరించుకోవడమే కాకుండా, పరిసరాల్లోని డజన్ల కొద్దీ సహజ జలవనరులు పునరుజ్జీవం పొందాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న దీపావళి, ఛట్ పూజ పండుగల వేళ మన నివాసాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఖాదీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు

పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌లో ప్రజలు స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు పెద్దపీట వేస్తున్నారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో మన రైతుల ఉత్పత్తులు అంతర్జాతీయ సరిహద్దులు దాటుతున్నాయన్నారు. కర్నాటక స్టార్టప్ వెదురు, వ్యవసాయ వ్యర్థాలతో ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ సామగ్రిని తయారు చేస్తోందని వివరించారు. ఈ ఏడాది గాంధీ జయంతి నాడు ఖాదీ గ్రామోద్యోగ్ విక్రయాలు ఒక్క రోజులోనే ఏకంగా రూ.28 కోట్లు దాటి సరికొత్త రికార్డు సృష్టించాయని వెల్లడించారు. చేతివృత్తుల వారిని ఆదుకునేలా స్థానిక వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ కోరారు.

ప్రాణాలు నిలుపుతున్న ‘ఈ -సంజీవని’..  

‘ఈ -సంజీవని’ పోర్టల్ పనితీరును ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశంలో ఇప్పటివరకు 50 కోట్ల టెలీ కన్సల్టేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని, డాక్టర్ల నిబద్ధతకు, ప్రజలకు వ్యవస్థపై ఉన్న నమ్మకానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1.90 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు పల్లెసీమలకు సంపూర్ణ ఆరోగ్య నిలయాలుగా సేవలందిస్తున్నాయని తెలిపారు.  

రన్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిటీలో పాల్గొనాలి

అక్టోబర్ 31న ‘ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు’ నరీందర్ సింగ్ కపానీ 100వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించే ‘రన్ ఫర్ యూనిటీ’లో ప్రజలంతా పెద్దఎత్తున పాల్గొని దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు భాయ్ పరమానంద్ 150వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. దేశ ప్రజలందరికీ దీపావళి, ఛట్ పండుగల ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.