హైదరాబాద్: నగరంలోని బోరబండలో విషాద ఘటన చోటుచేసుకుంది. హీటర్‌తో నీళ్లు వేడి చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఆయేషా సిద్దిఖ (26) అనే మహిళ మృతి చెందింది. బకెట్‌లోని నీటిని స్టీల్ మగ్‌తో తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
భరత్ నగర్‌లో ఉస్మాన్ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆయేషా.. హీటర్‌తో నీళ్లు వేడి చేస్తుండగా స్టీల్ మగ్‌తో బకెట్‌లోని నీటిని తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
బయటకు వెళ్లిన భర్త.. ఇంటికి వచ్చేసరికి విషాదం
ఘటన జరిగిన సమయంలో ఆయేషా భర్త అబ్దుల్ రవూఫ్ ఇంటి బయట ఉన్నాడు. ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవూఫ్‌కు ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ దంపతులు నిజామాబాద్ జిల్లా గాంధారి ప్రాంతానికి చెందినవారు. రెండేళ్ల క్రితమే వీరికి వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు అబ్దుల్ రజాక్ ఉన్నాడు.
ALSO READ : సౌదీలోని మనోళ్లకు ఎంబసీ అడ్వైజరీ..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
