- బెదిరింపులకు తలొగ్గమన్న ఇంటర్‌బోర్డు
- తనిఖీల్లో 65 కళాశాలల్లో నకిలీ ఫైర్ ఎన్వోసీలు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని, తప్పుడు ఆరోపణలు, బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని ఇంటర్మీడియట్ బోర్డు తేల్చిచెప్పింది. బోర్డు నిర్వహించే తనిఖీలను వేధింపులుగా చిత్రీకరిస్తూ సంఘాలు, యాజమాన్యాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించింది. ప్రైవేటు కాలేజీల్లో ఎలాంటి లోపాలున్నాయో ప్రజలందరికీ తెలిసేలా నేరుగా బోర్డు అధికారిక వెబ్సైట్లోనే పెడతామని హెచ్చరించింది.
ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు చేస్తున్న ఆరోపణలపై ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. తనిఖీల్లో ఏకంగా 65 కాలేజీలు నకిలీ ఫైర్ సేఫ్టీ ఎన్వోసీల అంశం బయటపడిందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 3,349 జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటివరకు 3,241 కాలేజీలకు గుర్తింపు ఇచ్చినట్టు ప్రకటించింది.
క్యాంపస్ మార్పు , డాక్యుమెంట్ల పరిశీలన పెండింగ్‌లో ఉన్న మరో 12 కాలేజీల దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని, ఆయా కాలేజీలు నిబంధనలు పూర్తి చేయగానే స్పెషల్ అడ్మిషన్ మాడ్యూల్ ద్వారా అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. విద్యార్థుల రక్షణ, విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపింది.
బోర్డును బెదిరించడం, తప్పుడు డేటా ప్రచారం చేయడం, నకిలీ పత్రాలు సమర్పించి అనుమతులు సాధించాలనుకోవడం సరికాదని తెలిపింది. ఇప్పటికే ఒక్క విద్యార్థి కూడా చేరని 27 కాలేజీలు మూతపడ్డాయని వివరించింది. యాజమాన్యాలు వదంతులు మానుకొని నిబంధనలు పాటించాలని, స్పెషల్ అడ్మిషన్ లాగిన్ల ద్వారా విద్యార్థుల ప్రవేశాలను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించింది.
