మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ ఘటన నేపథ్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీని సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీ సూచించారు. ప్రమాదకరమైన నీటి గుంతలు, చెరువుల వద్ద తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజల భద్రతకు అవసరమైన రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
