యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం..కరీంనగర్ లో రూ.28 కోట్ల వరకు టోకరా?

యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం..కరీంనగర్ లో రూ.28 కోట్ల వరకు టోకరా?

కరీంనగర్‌: యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడులు సేకరించి, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనిక్ మెర్కంటైల్, స్వయం మల్టీస్టేట్ సొసైటీల పేరుతో వివిధ పెట్టుబడి పథకాలను నిర్వహిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో నగదు సేకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

నెలవారీ పెట్టుబడి పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, హోటల్ ప్యాకేజీల పేరుతో ప్రజలను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్లు, ప్రాంతీయ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించిన వ్యక్తుల ద్వారా పలు జిల్లాల్లో పెట్టుబడులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారానికి సంబంధించి సుమారు రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు మోసం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో అంచనా వేసినట్లు సమాచారం.

2019లో వివిధ పెట్టుబడి పథకాల గడువు ముగిసినప్పటికీ, పెట్టుబడిదారులకు వారి సొమ్మును తిరిగి చెల్లించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయనే పేరుతో 2020లో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సమాచారం.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న రాజ్ కుమార్ కైలాష్ రాయ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసుకు సంబంధించి గుడిపాటి గాంధీ, మాకలసోంపల్లి కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప, కొమిరె భూమా గౌడ్, యేదెళ్ల రమేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈ పెట్టుబడుల పథకాలలో డబ్బులు పెట్టి నష్టపోయిన బాధితులు తమ సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా కరీంనగర్ క్రైమ్ కంట్రోల్ సెల్ (సీసీఎస్‌)లో ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.