ఏకపక్ష నిర్ణయాలేమి లేవు.. డెసిషన్స్ అన్నీ ముగ్గురు తీసుకున్నవే: ఈసీ

ఏకపక్ష నిర్ణయాలేమి లేవు.. డెసిషన్స్ అన్నీ ముగ్గురు తీసుకున్నవే: ఈసీ

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఖండించింది. సర్‎కు సంబంధించి జారీ చేసిన మూడు ఉత్తర్వులను ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా తీసుకుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‎లో ఈసీ పేర్కొంది. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కేవలం ఒకే ఒక్క మీడియా నివేదిక ఆధారంగా వచ్చాయని.. ఇందులో ఎలాంటి నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఇక, ఓటరు నమోదుకు ఉద్దేశించిన ఫామ్ 6లోనూ  ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని.. ఎన్నికల సంఘంలోని మరో ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఈసీ కీలక విషయాలు పేర్కొంది. 

సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలను ఈసీ పూర్తిగా ఖండించింది. సర్ ప్రక్రియకు సంబంధించి జూన్ 2025, అక్టోబర్ 2025, మే 2026లలో జారీ చేసిన మూడు ఉత్తర్వులు కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని ఈసీ అఫిడవిట్‎లో పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్ణయాలన్నీ ముగ్గురి సమ్మతితోనే జరిగాయని స్పష్టం చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు ముగ్గురూ కలిసి ఉమ్మడిగా ఈ అఫిడవిట్‌ను ఆమోదించారని ఈసీ న్యాయస్థానానికి తెలిపింది. 

►ALSO READ | కేరళలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందల ఐఫోన్లు మాయం.. విచారణకు ఆదేశించిన సతీశన్ సర్కార్

ఫైళ్ల ప్రాసెసింగ్ సమయంలో కమిషనర్ల వ్యక్తిగత సూచనలు, ప్రశ్నలు లేదా భిన్నాభిప్రాయాలు అంతర్గత సూచనల కిందకే వస్తాయని.. అంతిమంగా తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ సమష్టిగానే ఉంటాయని వివరించింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. కేవలం ఒకే ఒక్క వార్త పత్రిక కథనం ఆధారంగా ఈ ఆరోపణలు వచ్చాయని తెలిపింది. 

ఫామ్ 6లో ఎలాంటి మార్పులు చేయలే: ఈసీ

ఓటరు నమోదు కోసం ఉద్దేశించిన ఫారం 6లో మార్పులకు సంబంధించిన వివాదంపైన ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఫామ్-6 లో ఎలాంటి మార్పులు చేయలేదని అఫిడవిట్‏లో పేర్కొంది. ఫామ్ 6 ఫారాన్ని సవరించే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉందని తెలిపింది. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియకు అవసరమైన డిక్లరేషన్ ఒక ప్రత్యేక పత్రమని స్పష్టం చేసింది. ఈసీఐ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫామ్ 6 ప్రదర్శన గందరగోళానికి దారితీసి ఉండవచ్చని కమిషన్ అంగీకరించింది. అక్టోబర్ 21 నుంచి భౌతిక ఫారాల మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ ఫామ్-6, ఎస్ఐఆర్ డిక్లరేషన్‌ను విడివిడిగా చూపిస్తున్నట్లు స్పష్టం చేసింది