హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో తాగునీటి దుర్వినియోగంపై జలమండలి చర్యలు తీసుకుంది. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్ డివిజన్-16 పరిధిలో జలమండలి అధికారులు తనిఖీలు చేశారు. హోటల్ ప్యారడైజ్‌లో నీటి దుర్వినియోగాన్ని అధికారులు గుర్తించారు. CAN నంబర్ 612182839పై జరిమానా విధించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు. నీటి దుర్వినియోగానికి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.
రాష్ట్రంపై ‘ఎల్‌నినో’ పిడుగు పడబోతున్నదని, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే కష్టకాలం తప్పదని ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ముందస్తు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో మరో 80 రోజులకు మాత్రమే సరిపడా తాగునీరు మిగిలి ఉన్నదని, వర్షాభావం కొనసాగితే దాదాపు 4 లక్షల ఇండ్లకు నల్లా నీళ్లు బంద్ అయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయని, పల్లెల్లో ఉపాధి కరువై నగరాలకు వలసలు పోటెత్తే అవకాశం ఉన్నదని సర్కారును అప్రమత్తం చేసింది.
వర్షాభావం ఇలాగే కొనసాగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలతో పాటు దాదాపు 4 లక్షల నివాసాలకు పైప్లైన్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని జలమండలి వర్గాలు లెక్కగట్టాయి. నాగార్జునసాగర్, ఎల్లంపల్లిలో డెడ్ స్టోరేజీలను కూడా పూర్తిగా వాడేయాల్సిన విపత్కర పరిస్థితి ఏర్పడనుందని, అదే జరిగితే ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుందని ఉన్నతాధికారుల నివేదిక పేర్కొన్నది. అంచనాల ప్రకారం ఎగువ నుంచి జలాశయాలకు ఇన్-ఫ్లో రాకపోతే, డిసెంబర్ చివరి నాటికి నగరంలో రోజు విడిచి రోజు కూడా నీళ్లివ్వలేని దయనీయ పరిస్థితి వస్తుందని హెచ్చరించింది.
