80 ఏళ్ల వృద్ధ దంపతులు.. సిద్దిపేట నుంచి బాసరకు పోయి సచ్చిపోవాలనుకున్నరు !

80 ఏళ్ల వృద్ధ దంపతులు.. సిద్దిపేట నుంచి బాసరకు పోయి సచ్చిపోవాలనుకున్నరు !

బాసర: నిర్మల్ జిల్లా బాసరలో వృద్ధుల ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా చిన్నకొడురు మండల విట్టలపుర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ చారి (86), భార్య గోవిందమ్మ (81) ఆత్మహత్యకు పాల్పడేందుకు బాసర వెళ్లారు. లొకేషన్ ఆధారంగా బాసర దేవాలయానికి చెందిన టీటీడీ భవనం 122 గదిలో ఈ ఇద్దరూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వెంట తెచ్చుకున్న పాయిజన్ని కూడా వారి బ్యాగులో పోలీసులు గుర్తించారు. వృద్ధ దంపతుల కూతురు రేణుకను పిలిచి మాట్లాడి బాసర పోలీసులు వారిని క్షేమంగా కూతురికి అప్పగించారు. వృద్ధాప్యం, ఆర్థిక, సామాజిక, కుటుంబ పరమైన పలు అంశాల వల్ల ముసలితనంలో తీవ్ర మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముసలితనంలో పునరావాసం లేక ఇబ్బంది పడుతున్నారు.

మారుతున్న సోషల్ లైఫ్​స్టైల్​ కూడా సీనియర్ సిటిజన్లను ఒత్తిడికి, మానసిక అనారోగ్యాలకు గురిచేస్తోంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి న్యూక్లియర్ కుటుంబాలను నేడు చూస్తున్నాం. అలాగే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, సాంకేతికీకరణలు కూడా మనిషి లైఫ్​స్టైల్లో మార్పులకు కారణం అవుతున్నాయి. పిల్లలు విదేశాలకు వెళ్లడం, అక్కడే స్థిరపడడంతో సీనియర్ సిటిజన్లు ఒంటరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా సామాజిక, ఆర్థిక, భావోద్వేగ, కుటుంబ సంరక్షణ లేకపోవడం కూడా వాళ్ల జీవితాలను అభద్రతా వాతావరణంలో పడేస్తున్నాయి.

మోడ్రనైజేషన్, వేగవంతమైన లైఫ్​స్టైల్​ వల్ల సంప్రదాయ కుటుంబ వ్యవస్థ, సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. దీంతో రకరకాల మెంటల్ డిజార్డర్లు వృద్ధులను వెంటాడుతున్నాయి. మనదేశంలో నిర్వహించిన పలు స్టడీల్లో ఎందరో వృద్ధులు ఏదో ఒకరకమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని కూడా వెల్లడైంది.

వృద్ధుల్లో చాలామంది డిమెన్షియా, డిప్రెషన్లతో బాధపడుతున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. అరవై ఏండ్లు నిండిన వృద్ధులు చాలామందిలో మూడు రెట్ల దాకా డిప్రెషన్ ఉంటున్నట్టు తెలుస్తోంది. ఊళ్లలో ఉండే వృద్ధుల్లో న్యూరోటిక్ డిప్రెషన్, శారీరకపరమైన, ఒత్తిడితో కూడిన డిప్రెషన్లు కనిపిస్తున్నాయి.