భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు బస్సులో నుంచి తోసిన ఘటనలో గాయపడ్డ ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు భరోసా కల్పించింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. విధినిర్వహణలో ఉండగా ప్రయాణికురాలి దాడిలో గాయపడి హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ ప్రవళికను సోమవారం ( అక్టోబర్ 26 ) పరామర్శించారు టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్ వెంకన్న.పలువురు అధికారులతో కలిసి సాయిసంజీవని ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యమని.. కండక్టర్ ప్రవల్లికపై దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఈ సందర్భంగా గాయపడిన ప్రవళికకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆసుపత్రి వైద్యులకు ఈడీ వెంకన్న సూచించారు.
అనంతరం బాధితురాలు ప్రవళికతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఈడీ వెంకన్న, వారికి ధైర్యం చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రవళికకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ప్రవళికకు సంస్థ అన్ని విధాలా సంపూర్ణ భరోసా కల్పిస్తుందని స్పష్టం చేశారు. కండక్టర్పై దాడికి పాల్పడ్డ నిందితురాలిపై చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు.
విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతమాత్రం సహించేది లేదని అన్నారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల రక్షణకు యాజమాన్యం ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని, ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు తెగబడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
